నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ భవనానికి సంబంధించి, లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించిన 11 రకాల డిజైన్ లను సీఆర్‌డీఏ బుధవారం తమ వెబ్‌సైట్‌లోను, సోషల్ మీడియాలోనూ ఉంచింది. వాటిపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కోరింది. శాసనసభ భవన తుది ఆకృతుల్ని ఖరారు చేసే ముందు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ముఖ్యమంత్రి సూచన మేరకు వాటిని పరిశీలన కోసం ఉంచినట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో లండన్‌లో ఈ సంస్థ ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. అంతకంటే ముందే, ఈ డిజైన్ లపై, ప్రజల నాడి ఎలా ఉందో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, సీఆర్‌డీఏ ప్రజల ముందు ఉంచుంది.

amaravati design 21102017 2

గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఏపీసీఆర్డీయే వెబ్‌సైట్‌లో ఉంచిన మొత్తం 11 ఆప్షన్ల పై తమ అభిప్రాయాలు తెలిపిన వారిలో అత్యధికులు, ఆప్షన్ 1 అయిన, వాచ్‌ టవర్‌ ని ఎన్నుకున్నారు. బుధవారం నుంచి, శుక్రవారం సాయంత్రం వరకు అన్నింట్లో కలిపి మొత్తం 3,999 మంది స్పందించారు. వీరిలో 1500 మంది ఆప్షన్‌ 1 సెలెక్ట్ చెయ్యగా, మిగిలిన 2,499 మంది ఇతర 10 ఆప్షన్లు సెలెక్ట్ చేశారు. మరికొన్ని రోజులపాటు ఈ డిజైన్ల పై ప్రజాభిప్రాయం తీసుకోనున్నారు. ఫైనల్ గా ముఖ్యమంత్రి ఆమోదం మేరకు, సెలెక్ట్ చెయ్యనున్నారు.

amaravati design 21102017 3

అయితే పది రోజులు క్రిందట, అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మించదలచిన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్ల పై దర్శకుడు రాజమౌళి, మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌, మాజీ కమిషనర్‌ శ్రీకాంత్‌, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు నార్మన్‌ ఫోస్టర్‌తో జరిపిన భేటీలో... ఆ సంస్థ ఇప్పటికే రూపొందించిన డిజైన్లలోని లోటుపాట్లను రాజమౌళి సునిశితంగా విశ్లేషించారని సమాచారం. ప్రస్తుతం, దుబాయి పర్యటనలో ఉన్న చంద్రబాబు, అమరావతి డిజైన్ల పై లండన్‌లో అక్టోబర్‌ 24, 25 తేదీల్లో నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణాలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్ 25న తుది డిజైన్లు ఇవ్వనున్నారు.

Advertisements