ముంబయికి చెందిన ప్రఖ్యాత లీలావతి సహా మరో 5 ప్రముఖ ఆసుపత్రుల శాఖలు త్వరలో అమరావతిలో ఏర్పాటు కానున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రాథమిక వైద్యం, కుటుంబ సంక్షేమ, గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిడారి శ్రావణ్‌కుమార్‌ మంత్రులు చినరాజప్ప, లోకేశ్‌, అఖిలప్రియ, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అభినందనలు తెలిపారు. సచివాలయంలోని కిడారి ఛాంబర్‌లో శుక్రవారం వారు ఆయన్ని అభినందించారు.

leela 17112018 2

ఈ సందర్భంగా చైనా పర్యటనకు ముందు శాసనసభ సమావేశాల సమయంలో దివంగత కిడారి సర్వేశ్వరావుతో నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించినట్లు లోకేశ్‌ గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కిడారి కోరగా మంత్రులందరి తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అరకులో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులు ప్రారంభించాలని మంత్రిని కిడారి శ్రావణ్‌ కోరగా ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌లు) సిద్ధమయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని లోకేశ్‌ చెప్పారు. అరకును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని మంత్రి అఖిలప్రియను కోరగా.. ఎవరైనా ముందుకొస్తే పీపీపీ పద్ధతిలో ఆ పనులు చేపడతామని ఆమె బదులిచ్చారు.

Advertisements