రాజధాని ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా నిర్మితమవుతున్న సెక్రటేరియట్‌ - హెచ్‌వోడీ టవర్లకు ఫౌండేషన్‌ ప్రక్రియకు ఏపీ సీఆర్డీయే సిద్ధమవుతోంది. దేశంలోనే ఇంతకు ముందెక్కడా కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 5 టవర్ల (ఒక్కొక్కటి 40 అంతస్థులతో 4టవర్లు, 50 అంతస్థులతో 1)కూ కలిపి 12 వేల క్యూబిక్‌ మీటర్ల మేర ఒకే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను వేయాలని నిర్ణయించిన ఏపీసీఆర్డీయే అమరావతికి మరో విశిష్ఠతను జోడించనుంది. వేలాది కార్మికులు, నిపుణులతోపాటు భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి, యంత్రాలు, సునిశిత ప్రణాళిక, అద్భుత సమన్వయం అవసరమయ్యే ఇంతటి ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ దేశంలో ఇదే ప్రథమని చెబుతున్నారు! 3 రోజులు రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తే గానీ పూర్తవని ఈ బృహత్తర ప్రక్రియను త్వరలోనే చేపట్టాలని సీఆర్డీయే భావిస్తోంది. ఇందుకోసం పలు శాఖలు, సంస్థలు, నిష్ణాతులను సమన్వయపరచుకోవడంలో నిమగ్నమైంది.

amaravati 09122018 2

అన్నీ వేలాది టన్నుల్లోనే.. సచివాలయం 5 టవర్లకు కలిపి సుమారు 13 అడుగుల లోతున వేసే 12 వేల క్యూ.మీ. అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు అదే స్థాయిలో నిర్మాణ సామగ్రి అవసరం. దీనికోసం సుమారు 1300 టన్నుల స్టీల్‌, 3,000 టన్నుల సిమెంట్‌, 12,000 టన్నుల కంకర, 8,000 టన్నుల ఇసుక, 3,000 టన్నుల ఫ్లైయా్‌షతోపాటు 12 లక్షల లీటర్ల కృష్ణానదీ జలాలు కావాల్సి ఉంటుందని అంచనా వేశారు. వీటన్నింటినీ కలిపి కాంక్రీట్‌ మిక్సర్‌ తయారు చేసేందుకు 35 టన్నుల సామర్ధ్యం కలిగిన హెడ్‌ మిక్సర్లను వినియోగించాలి.

 

amaravati 09122018 3

సామగ్రి తరలింపునకు భారీ ప్రణాళికలు.. భారీగా అవసరమయ్యే నిర్మాణ సామగ్రిని సచివాలయం నిర్మాణ ప్రాంతంలో ఉంచడం సాధ్యం కాదు కాబట్టి అవి లభ్యమయ్యే చోటు నుంచి వాటిని ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేసే రోజుల్లో నేరుగా చేర్చనున్నారు. వచ్చే వారం ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రానుందని సమాచారం. అది పూర్తయిన వెంటనే బహుశా ఈ నెల 10- 16 తేదీల మధ్య ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేయవచ్చునని తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పనులు ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించింది. ఇంతటి అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేయబోతున్న సీఆర్డీయే.. కాంక్రీట్‌ టెక్నాలజీలో ప్రపంచంలోనే సుప్రసిద్ధ సంస్థలు, వ్యక్తుల మార్గదర్శకత్వంలో ఎప్పటికప్పుడు పలు పరీక్షలు చేయిస్తూ, వాటి ఫలితాల ఆధారంగా కార్యాచరణను రూపొందించుకుంటోంది.

Advertisements