పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా చేపట్టిన భారీ రోడ్ షో సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ‘అమిత్ షా గో బ్యాక్’ అంటూ స్లోగన్స్ చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సమయంలో అమిత్‌ షా కాన్వాయ్‌పైకి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కర్రలు, రాళ్లు విసిరారంటూ భాజపా కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు నిప్పు అంటించారు. భాజపా కార్యకర్తల రెచ్చిపోయి ఘర్షణలు చెలరేగేలా చెయ్యటంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. భద్రతా సిబ్బంది సాయంతో ఈ దాడుల నుంచి అమిత్ షా సురక్షితంగా తప్పించుకున్నారు.

kolkata 14052019 1

బీజేపీ కార్యకర్తల దాడిలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రతిమ ధ్వంసమైంది. అమిత్‌ షా ర్యాలీ కోల్‌కతా విశ్వవిద్యాలయం వద్దకు చేరుకోగానే ఈ ఘర్షణలు చెలరేగాయి. కాలేజీ హాస్టల్‌ ను టార్గెట్ చేస్తూ ఆ భవనం ముందు భాజపా కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. హాస్టల్ గేట్లను మూసివేసి, హాస్టల్ బయట ఉన్న సైకిల్స్, మోటార్‌బైక్స్‌ను బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. దీంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. హాస్టల్ బయట ఉన్న చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. టీఎంసీ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయని అమిత్ షా చెప్పారు. మమత ప్రభుత్వం రోడ్ షోను అడ్డుకోవాలని చూసిందని విమర్శించారు.

kolkata 14052019 1

అమిత్ షా విమర్శల పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. అమిత్ షాను గుండా అని అభివర్ణించిన ఆమె.. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రతిమను ధ్వంసం చేసినందుకు నిరసనగా.. గురువారం ర్యాలీ చేపడతానని తెలిపారు. జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి గూండాల్ని రప్పించి అమిత్ షా గొడవలు సృష్టించారని ఆమె విమర్శించారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరిన నేపథ్యంలో తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ- బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు ఇస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సౌత్‌ 24 పరగణాల్లో అమిత్‌ షా ప్రచారం నిర్వహించారు.

Advertisements