జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(నరేగా) అమలులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ పది అవార్డులు సాధించింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర, మండల, గ్రామస్థాయి అవార్డులను ప్రదానం చేసింది. 15 విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిదింట పది పురస్కారాలను చేజిక్కించుకుంది. వీటిని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, కార్యదర్శి బి.రామాంజనేయులు, సంచాలకులు రంజిత్‌భాషా అందుకున్నారు.

awards 12092018 2

నరేగా అమలులో ఉత్తమ జిల్లాలుగా ఎంపికైన విశాఖపట్నం, చిత్తూరు తరఫున కలెక్టర్లు ప్రవీణ్‌కుమార్‌, వినయ్‌చంద్‌, ఆయా జిల్లాల అప్పటి డ్వామా పథక సంచాలకులు ఎ.కల్యాణచక్రవర్తి, ఎన్‌.పోలప్ప అవార్డులు స్వీకరించారు. వ్యక్తిగత అవార్డుల్లో భాగంగా నూరు శాతం ఆస్తులు జియో ట్యాగింగ్‌ చేసిన కర్నూలు జిల్లాకు చెందిన జీఐఎస్‌ సహాయకుడు కె.షారోన్‌పాల్‌, డీబీటీ విధానంలో వేతన చెల్లింపులు చేసిన గ్రామీణ తపాలా సేవకుల అవార్డును డి.రాంబాబు అందుకున్నారు.

awards 12092018 3

ఉత్తమ గ్రామ పంచాయతీ కేటగిరిలో ఎంపికైన చిత్తూరు జిల్లా కోటబయలు తరఫున సర్పంచి ఎం.శ్రీనివాసులు, క్షేత్ర సహాయకుడు రెడ్డి బాషా అవార్డులు పొందారు. గత మూడేళ్లుగా వివిధ కేటగిరిల్లో వరుసగా మొదటి స్థానంలో రాష్ట్రం నిలవడంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లోకేశ్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అవార్డు విజేతలు అందరికీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు ప్రభుత్వానికి మరింత పేరు తేవాలని ఆకాంక్షించారు.

Advertisements