తుఫాను అంటేనే వణుకుతున్న శ్రీకాకుళం జిల్లాకు మరో గండం పొంచి ఉన్నదని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. తితలీ దెబ్బ నుంచి ఇంకా కుదుటపడనేలేదు. ఇటువంటి సమయంలో మరో తుఫానా? అంటూ శ్రీకాకుళం ప్రజలు కంగారుపడుతున్నారు. కొందరు విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రానికి ఫోన్‌ చేసి వాకబు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే ఈ నెల 23కల్లా ఉత్తర అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నదని భారత వాతావరణ శాఖ బుధవారం బులెటిన్‌లో పేర్కొంది.

cyclone 18102018 2

ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల మేరకు అల్పపీడనం ఏర్పడుతుందని మాత్రమే అంచనా వేసిందని, దీనిపై స్పష్టత రావాలంటే మరో నాలుగు రోజులు ఆగాలని సంబంధిత శాఖ అధికారి ఒకరు తెలిపారు. అల్పపీడనం బలపడి వాయుగుండం, ఆ తరువాత తుఫానుగా మారితే అప్పుడు దాని గమనం తెలుస్తుందని...ఈలోగా దానిపై ఏమీ చెప్పలేమన్నారు. అల్పపీడనం ఏర్పడిన తరువాత బంగాళాఖాతంలో వాతావరణం, గాలుల తీవ్రత తదితర అంశాలపై ఆధారపడి దాని పయనం ఉంటుందన్నారు. ఈసారి ‘దయె’ తుఫాను వస్తుందన్న వదంతులను కొట్టివేశారు. దయె తుఫాను గత నెలలోనే వచ్చిందన్నారు.

cyclone 18102018 3

ఒకవేళ బంగాళాఖాతంలో తుఫాను వస్తే దానికి ‘గజ’ అని పేరు పెడతారన్నారు. వదంతులు నమ్మవద్దని కోరారు. కాగా. ఈనెల 22 లేక 23 తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడుతుందని ఆర్టీజీఎ్‌స/ఇస్రో నిపుణుడు తెలిపారు. దీనిపై మరింత స్పష్టతకు మూడు, నాలుగు రోజులు ఆగాలని, అప్పుడే దాని గమనం తెలుస్తుందన్నారు. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతులు తుఫానులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అయితే తుఫానులు ఏర్పడకముందే వదంతులు నమ్మవద్దని సూచించారు.

 

Advertisements