అమరావతి రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో సెక్రటేరియట్‌ టవర్లలోని రెండింటి(3, జీఏడీ) ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు శుక్రవారం పూర్తయ్యాయి. సచివాలయం, వివిధ శాఖల విభాగాధిపతుల జీఏడీ టవర్‌ రాఫ్ట్‌ ఫౌండేషన్‌ శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో రికార్డు సమయంలో పూర్తయిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. నిర్మాణ ప్రదేశంలో రాఫ్ట్‌ ఫౌండేషన్‌ తుది దశ పనులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. అనంతరం శ్రీధర్‌ మాట్లాడుతూ జీఏడీ టవర్‌కు మొత్తం 11,236 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటును 55 గంటల్లో వేసినట్లు తెలిపారు. ఈ నెల 2న మధ్యాహ్నం టవర్‌ పనులు ప్రారంభించామన్నారు. 500 మంది కార్మికులు, ఇంజినీర్లు మూడు షిఫ్టుల్లో పనిచేశారని ఆయన తెలిపారు. సచివాలయం, హెచ్‌వోడీకి సంబంధించి టవర్‌-3 రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం ప్రారంభించిన ఎల్‌అండ్‌టీ సంస్థ 58 గంటల్లో శుక్రవారం ఉదయానికి పనులు పూర్తి చేసిందన్నారు. డిసెంబరు 27న ముఖ్యమంత్రి టవర్‌-2 పనులు ప్రారంభించగా సంబంధిత గుత్తేదారు సంస్థ 66 గంటల్లో రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పూర్తిచేసిందన్నారు.

crda 05012019 2

3వ టవర్‌ ఫౌండేషన్‌ పనులు గత మంగళవారం మొదలవగా, జీఏడీ టవర్‌ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. వీటి పరిమాణాన్ని బట్టి ఒక్కొక్క టవర్‌ ఫౌండేషన్‌ పనులు పూర్తవ్వాలంటే 3 రోజులు అవసరం. అది కూడా ఒక్క క్షణం కూడా పనులు ఆపకుండా చేపట్టాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే 5 టవర్లతో కూడిన సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లో మొట్టమొదటగా గత నెల 27వ తేదీన ప్రారంభమైన తొలి టవర్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు 65 గంటల్లోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత 3, జీఏడీ టవర్‌ల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు వరుసగా మంగళ, బుధవారాల్లో మొదలయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం 3వ టవర్‌ పనులు శుక్రవారమే పూర్తయ్యాయి. కాగా, జీఏడీ టవర్‌ పనులు శనివారం నాటికి ముగియాల్సి ఉండగా, శుక్రవారం సాయంత్రానికే అయ్యింది.

crda 05012019 3

ఇప్పటి వరకూ ఈ భారీ ఫౌండేషన్‌ పనులు చేపట్టిన 3 టవర్లలోకెల్లా అత్యంత వేగంగా పూర్తయిన టవర్‌గా జీఏడీ టవర్‌ నిలిచింది. కాగా, శాశ్వత సచివాలయ సముదాయంలోని మిగిలిన రెండు(1, 4) టవర్ల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనుల్లో ఒక దాన్ని సంక్రాంతి తర్వాత, మిగిలిన దాని పనులు ఈ నెలాఖర్లో చేపట్టనున్నట్టు సమాచారం. రాజధాని అమరావతి పరిధిలో వివిధ భవనాల నిర్మాణాలు రాత్రి, పగలూ అనే తేడాలేకుండా శరవేగంగా జరుగుతున్నాయి. సచివాలయం పరిధిలోని సీఎం టవర్‌ సహా హైకోర్టు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల గృహ నిర్మాణ పనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. విద్యుద్దీపాల వెలుగులో జరుగుతున్న సంబంధిత పనులతో ప్రస్తుతం అమరావతి ప్రాంతం కళకళలాడుతోంది. అధికారుల పర్యవేక్షణలో శ్రామికులు షిప్టులవారీగా వారీగా పనిచేస్తున్నారు. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మాణరంగ పనుల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఒకవైపు విద్యుద్దీపాల వెలుగులు, మరోవైపు పెద్ద సంఖ్యలో శ్రామికుల సందడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

Advertisements