ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎవర్ని నియమిస్తారా..? అనేదానిపై గత కొన్ని రోజులుగా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ ఉత్కంఠకు శనివారం మధ్యాహ్నంతో వైసీపీ పెద్దలు తెరదించేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి గెలిచిన తమ్మినేని సీతారాం పేరు దాదాపు ఖరారు అయిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే తమ్మినేని.. వైఎస్ జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే అధికారికంగా ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని తెలుస్తోంది. వైసీపీలో సీనియర్ నేత.. పైగా మంచి వాక్‌చాతుర్యం కలిగిన వ్యక్తి, సౌమ్యుడిగా, అందర్నీ కలుపుకుని పోయే వ్యక్తిగా పేరున్న తమ్మినేనిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించిందని సమాచారం.

speaker 07062019

కాగా.. స్పీకర్‌గా అంబటి రాంబాబు, ఆనం రాంనారాయణరెడ్డి, కోన రఘుపతితో పాటు నగరి నుంచి గెలిచిన రోజా పేర్లు ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరిలో కొందరు స్పీకర్ పదవికి నిరాకరించారని తెలుస్తోంది. కళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం గతంలో మంత్రిగా పనిచేశారు. 1983 ఎన్నికల్లో ఆముదాలవలస నుంచి మొదటిసారి తమ్మినేని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికి ఆరుసార్లు సీతారాం ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో ప్రభుత్వ విప్‌గా తమ్మినేని పనిచేశారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్ మంత్రిగా తమ్మినేని పనిచేసి తనదైన ముద్రవేసుకున్నారు.

speaker 07062019

మరో పక్క, వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. సెక్రటేరియట్‌ మొదటి బ్లాక్‌లో సీఎం జగన్‌ కార్యాలయం ఉంది. శనివారం ఉదయమే కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.49 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు.

Advertisements