ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అంటే చాలు, ప్రభుత్వ పెద్దలు భగ్గు మంటున్నారు. ఆయన ఒక్కరే కాదు, ఆయనకు ఎవరైనా సహకరిస్తే, వాళ్ళ పైన కూడా వేటు వేస్తున్నారు. తాజాగా నిమ్మగడ్డ తిరుమల పర్యటనలో, ఐఏఎస్ అధికారి పాల్గునటం పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. 2019 జూన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా బసంత్‍కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన విశాఖ మెట్రో రీజియన్ వైస్ చైర్మెన్ గా కూడా పని చేసారు. అంతకు ముందు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వద్ద అదనపు కార్యదర్శిగా కూడా బసంత్‍కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా గవర్నర్ ముఖ్య కార్యదర్సిగా కూడా పని చేసారు. అయితే ప్రస్తుత్తం తిరుపతి తిరుపతి జేఈవోగా ఉన్న బసంత్‍కుమార్‍ ని, రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు కలెక్టర్ గా బదిలీ చేసింది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. వేరే వారిని గుంటూరు కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఇచ్చిన సిఫారసుని ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు ప్రతి జిల్లాకు పర్యవేక్షకులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది.

ias 05022021 2

అందులో భాగంగా తిరుపతి జేఈవో బసంత్‍కుమార్‍ ని, నెల్లూరు పర్యవేక్షకులగా నియమించింది. ప్రస్తుతం నామినేషన్ ల ప్రక్రియ జరుగుతూ ఉండటంతో, బసంత్‍కుమార్‍ నెల్లూరు లో నామినేషన్ ప్రక్రియ కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ నెల 3 వ తేదీన, తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, ఏర్పాట్లు పరిశీలనకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ వచ్చిన సందర్భంలో, రమేష్ కుమార్ కు స్వగతం పలికేందుకు, తిరుపతి జేఈవో బసంత్‍కుమార్‍ వచ్చారు. అలాగే తిరచానురులో అమ్మవారి దర్శనం కూడా దగ్గరుండి చేపించటంతో పాటు, తిరుమల ఆయన పరిధిలోకి రానప్పటికి కూడా తిరుమలలో కూడా ఆయన దగ్గరుండి, ఎస్ఈసికి తోడుగా ఉండటంతో, ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో, బసంత్‍కుమార్‍పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని, ఆయన్ను ప్రభుత్వం ఆదేశించటం, ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయంసం అయ్యింది.

Advertisements