జిల్లా కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన కాటమనేని భాస్కర్‌ తొలిరోజే తన పాలన ఎలా వుంటుందో చూపించారు. ప్రవీణ్‌కుమార్‌ నుంచి ఉదయం పది గంటలకు బాధ్యతలు స్వీకరించిన భాస్కర్‌ వెనువెంటనే కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘మీకోసం-ప్రజావాణి’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక వైపు ప్రజా సమస్యలు వింటూనే అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశ మందిరంలో తన సీటులో కూర్చుంటూనే కలెక్టర్‌ రాగానే లేచి నిలబడడం వంటి ప్రొటోకాల్‌ పద్ధతులు పాటించనవసరం లేదని, మంత్రులు, ఎంపీలు వచ్చినప్పుడు లేచి నిలబడితే సరిపోతుందన్నారు. సమావేశ మందిరంలో ఒక్కరు కూడా నిలబడి వుండడం తనకు ఇష్టం వుండదని, అందరూ కూర్చుని మాట్లాడాలని సూచించారు.

bhaskar 26012019

చిన్నోడ్ని...చెబితే వింటానని అనుకోవద్దు... కలెక్టర్‌ భాస్కర్‌ మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తూనే పలువురు అధికారులకు చురకలు అంటించారు. ఆనందపురంలో తాగునీటి కుళాయికి పైపు ఏర్పాటుచేయడం లేదని అందిన ఫిర్యాదుపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవికుమార్‌ను కలెక్టర్‌ పిలిచి ఇంత చిన్న సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. దీనికి ఆయన పంచాయతీ వారు చూడాలని చెప్పడంతో, కలెక్టర్‌ కాస్త అసహనానికి గురయ్యారు. ‘నాకు తెలిసినంత వరకు రక్షిత పథకాల నిర్వహణ బాధ్యతలు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లే చూడాలి. మరి మీరు పంచాయతీలు చూస్తున్నాయని చెబుతున్నారు. నేను చిన్నోడ్ని...ఏం చెప్పినా వింటాను అని అనుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు. పైపులైను సమస్యకు తక్షణం పరిష్కారం చూపాలని ఆదేశించారు.

 

bhaskar 26012019

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 11 ఫోన్‌ కాల్స్‌... ఈ సందర్భంగా ముందుగా డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసిన కాలర్స్‌తో భాస్కర్‌ మాట్లాడారు. అనకాపల్లి మండలం కొత్తూరు నుంచి సంధ్య అనే మహిళ మాట్లాడుతూ తమ గ్రామంలో కాలువలు లేవని ఫిర్యాదు చేశారు. కాలువలు లేకపోతే డ్వామా అధికారులను పంపి కాలువలు ఏర్పాటుచేస్తామని, అయితే స్థానికులు కాలువల నిర్మాణానికి సహకరించాలని కోరారు. రెండు రోజుల్లో గ్రామానికి వెళ్లాలని డ్వామా అధికారులను ఆదేశించారు. మిగిలిన కాలర్స్‌ నుంచి అందిన సమస్యలకు కూడా పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisements