పశ్చిమ బెంగాల్‌ విషయంలో, సుప్రీం కోర్టులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. శారదా కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో కోల్‌కతాలో నిన్న రాత్రి నుంచి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దర్యాప్తులో భాగంగా కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా.. వారిని పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో తాజా పరిణామాలను సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తునకు సహకరించేలా సీపీ రాజీవ్‌ కుమార్‌ను ఆదేశించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కోల్‌కతా‌ ఘటన నేపథ్యంలో తమ కేసును తక్షణ విచారణకు చేపట్టాలన్న సీబీఐ అభ్యర్థనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తోసిపుచ్చారు.

mamatha 04022019

సీబీఐ అధికారుల అరెస్టుపై దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. సీబీఐ అధికారులను అన్యాయంగా అరెస్టు చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ లొంగిపోయేలా అదేశాలివ్వాలని కోరారు. విచారణ ఆధారాలను రాజీవ్ కుమార్ మరుగునపడేలా చేశారని వాదించారు. దీనిపై స్పందించిన సీజేఐ.. వాటికి ఆధారాలు ఉంటే చూపాలని సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జెనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ పిటిషన్‌పై నేడు అత్యవసర విచారణ చేపట్టాలని తుషార్‌ కోర్టుకు విన్నవించారు. అయితే ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. రాజీవ్‌ కుమార్‌పై ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి రుజువులు లేనందున ఈ కేసును మంగళవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

mamatha 04022019

మరో పక్క, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న హైడ్రామా ఇవాళ పార్లమెంటుకు చేరింది. ఉభయ సభలు ప్రారంభం కాగానే కేంద్రం వైఖరిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యసభలో టీఎంసీ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలను అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సీబీఐ దుర్వినియోగంపై చర్చ చేపట్టాలంటూ టీఎంసీ పట్టుపట్టింది. దీంతో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రకటించారు. లోక్‌సభలోనూ సీబీఐ వ్యవహారంపై గందరగోళం రేగింది. సంతాప తీర్మానాల అనంతరం సుప్రియా సూలే ఎన్ఎస్ఎస్‌వో గణాంకాలపై లోక్‌సభలో లేవనెత్తారు.

Advertisements