విశాఖ నగరం పై టీమిండియా కెప్టైన్ విరాట్‌ కోహ్లి ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య బుధవారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారమే ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో మంగళవారం తాను బస చేసిన హోటల్‌ నుంచి కోహ్లి బీచ్ రోడ్ కనబడేలా ఫోటో తీసుకుని దాన్ని ట్వీట్‌ చేస్తూ.. 'అద్భుతమైన ప్రదేశం. ప్రియమైన విశాఖకు వచ్చాను' అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. విశాఖపట్నం, దేశం, ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతుంది. విశాఖ వన్డే సందర్భంగా కోహ్లి సేనకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు.

cbn tweet 24102018 1

సరిగ్గా పది నెలల తర్వాత విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌తో స్థానికంగా సందడి మొదలైంది. ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్‌ ఏడు మ్యాచ్‌లాడగా ఆరింట్లో నెగ్గింది. 2013లో ఎదురైన ఏకైక ఓటమి విండీస్ పైనే కావడం గమనార్హం. ఈ మైదానంలో టాస్‌ ఓడిన జట్టు ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేదు. రాత్రి మంచు ప్రభావం ఉండడంతో టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ తీసుకునే చాన్స్‌ ఉంది. ఈ పిచ్‌పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వికెట్‌పై పచ్చిక లేకపోవడంతో స్పిన్నర్లూ కీలకమే.. ఇక్కడ అధిక వేడితో పాటు తేమ వాతావరణం ఉన్నా మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

cbn tweet 24102018 1

2011లో విండీస్‌ జట్టు రెండోసారి వై.ఎస్‌.ఆర్‌. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆడేందుకు వచ్చింది. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ చెలరేగి ఆడి 117 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదే స్టేడియంలో 2010 అక్టోబరు 20న జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై కోహ్లీ 118 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2016 అక్టోబరు 29న భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. విశాఖ స్టేడియం కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం. బుధవారం నాటి మ్యాచ్‌లో కూడా కోహ్లీ శతకం కొడతాడనే అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisements