చంద్రబాబు రహస్య పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎమ్మెల్యేలు టాప్‌ గ్రేడ్‌ కొట్టేశారు. మిగిలిన వారిలో కొందరికి ఫస్ట్‌క్లాస్‌ రాగా, ఇంకొందరు సగటు మార్కులతో గట్టెక్కారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరును అంచనా వేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రహస్యంగా నిర్వహించిన పరీక్ష (సర్వే) ఫలితాలను గురువారం ఎమ్మెల్యేల సమావేశంలో వెల్లడించారు. కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ 79.66 శాతం మార్కులతో నెం.1 స్థానంలో నిలిచారు. ఆయన తరువాత స్థానంలో 70 శాతం పైబడిన మార్కులతో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలకు 60 శాతం మార్కులే వచ్చాయి.

cbn survey 12052018 2

జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు... అచ్చెన్నాయుడు(శ్రీకాకుళం), లలితకుమారి(విజయనగరం), అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణ (విశాఖ), తోట త్రిమూర్తులు, జోగేశ్వరరావు (తూ.గో), చింతమనేని ప్రభాకర్‌, నిమ్మల రామానాయుడు, రాధాకృష్ణ (ప.గో), వల్లభనేని వంశీ, శ్రీరాంతాతయ్య, బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ (కృష్ణా), గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర పనితీరు బాగుందని చంద్రబాబు కితాబిచ్చారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేయించి.. ‘మూడు నెలలకొకసారి సమాచారం తెప్పించుకుంటానని కార్యకర్తల మనోభావాలను గమనించాలని, పనితీరును మెరుగు పరుచుకోవాలని’ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు.

cbn survey 12052018 3

పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల పని తీరును అంచనా వేయడానికి ఐదు ప్రశ్నలను తయారు చేసి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఒక్కో ప్రశ్నకు 70 శాతం దాటిన వారికి టాప్‌ గ్రేడ్‌ ఇచ్చారు. ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది? కార్యకర్తలకు అందు బాటులో ఉంటున్నారా? పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారా? ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపుతున్నారా? నియోజకవర్గంలోని నాయకులందరిని సమన్వయంతో కలుపుకెళ్తున్నారా లేదా? సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగే విధంగా పర్యవేక్షిస్తున్నారా? అనే ఐదు ప్రశ్నలకు కార్యకర్తల నుంచి సమాధానాలు సేకరించారు. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఫోన్లు చేసి వివరాలు నమోదు చేసుకున్నారు.

Advertisements