దేశంలో బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఆయా పక్షాల నేతలను కలుస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు.. అదే క్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 19న కోల్‌కతా వెళ్లనున్నట్లు తెలిసింది. నిజానికి మమతతో ఎప్పటికప్పుడు ఆయన ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలను ఏకం చేసే పనిపై తొలిసారి ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం కూడా అక్కడ జరిగిన పరిణామాలను ఆమెకు వివరించారు.

mamatha 13112018 2

అయితే కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభమయ్యాక నేరుగా ఆమెను కలువడం సాధ్యపడలేదు. ఢిల్లీలో పలు పార్టీల నేతలను.. కర్ణాటక, తమిళనాడులో అక్కడి ముఖ్య పార్టీల నేతలను మాత్రమే కలిశారు. దరిమిలా మమతతో ముఖాముఖి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై 19న వీరిద్దరూ చర్చిస్తారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు, సానుకూలతలపై మంతనాలు జరుపుతారు. కాగా.. జనవరి 18న గానీ, 19న గానీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని మమత నిర్ణయించారు.

mamatha 13112018 3

ఆ ర్యాలీకి అన్ని బీజేపీయేతర పార్టీలను పిలవాలని యోచిస్తున్నారు. దీనిపైనా ఇరు నేతలు చర్చిస్తారు. ఢిల్లీలో ఈ నెల 22న జరపతలపెట్టిన బీజేపీయేతర పక్షాల విందు సమావేశంపైనా మాట్లాడుకుంటారు. మరోవైపు.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలన్నీ ఉమ్మడి ర్యాలీలు ఏర్పాటుచేయాలన్న కాంగ్రెస్‌ ప్రతిపాదన పై ఢిల్లీలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. భాజపాయేతర పార్టీలను సంఘటితం చేసే ప్రక్రియలో మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీని అత్యంత కీలకమైనదిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వామపక్ష నేతలతోనూ మంతనాలు జరిపారు. వారికి బద్ధశత్రువైన మమతాబెనర్జీతో ఆయన భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisements