చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం ఎన్‌ఆర్‌ కమ్మపల్లెలో గురువారం అర్థరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రీపోలింగ్‌ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఇద్దరు రామచంద్రాపురం మండలంలో ఓటుకు నోటు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డి సాయంత్రం ఎన్‌ఆర్‌కమ్మపల్లెకు వెళ్లారు. ఇది గమనించిన గ్రామస్థులు మోహిత్‌రెడ్డిని అడ్డుకున్నారు. చీపుర్లు, చేటలు చేతపట్టి నిరసన తెలిపారు. దీనిపై మోహిత్‌రెడ్డి తమ మద్దతుదారులకు సమాచారం అందించడంతో పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో పాటు పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఎన్‌ఆర్‌కమ్మపల్లెకు చేరుకున్నారు.

chevireddy 17052019

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులి వర్తి నాని కూడా గ్రామస్థులకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపినా పరిస్థితి అదుపులోకి రాలేదు. డీఐజీ క్రాంతిరాణా టాటా ఓవైపు, ఎస్పీ అన్బురాజన్‌ మరోవైపు ఇరు వర్గాల నాయకులతో మాట్లాడి పరిస్థితిని కొంతవరకు అదుపులోకి తెచ్చారు. అయితే వైసీపీ కార్యకర్తలు తిరిగి ఆందోళనకు దిగడంతో పాటు తిరుపతి వెస్ట్‌ డీఎస్పీపై చేయి చేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. అనంతరం చెవిరెడ్డిని, నానిని అరెస్టు చేశారు. చెవిరెడ్డిని రేణిగుంట పోలీసుస్టేషన్‌కు. నానిని గాజుల మండ్యం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనలతో ఎన్‌ఆర్‌కమ్మపల్లె గ్రామస్థులు, దళితవాడ ప్రజలు తీవ్ర భాయాందోళనకు గురయ్యారు.

chevireddy 17052019

పల్లెల్లో చిచ్చురేపుతున్న వైసీపీ నేతలపై దుమ్మెత్తి పోశారు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి రీపోలింగ్‌కు ఆదేశాలు తెచ్చారని గ్రామస్థులు ఆరోపించారు. అరెస్టు చేసిన ఇద్దరు అభ్యర్థులను అర్థరాత్రి తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. టీడీపీ అభ్యర్థి నాని గాజులమండ్యం పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ చెవిరెడ్డి కుమారుడు రౌడీషీటర్లతో ఎన్‌ఆర్‌ కమ్మపల్లెకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నాడని తెలిసి తానూ ఆ గ్రామానికి వెళ్లగా పోలీసులు అక్రమంగా తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు.

Advertisements