జనతాదళ్(లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు తన తనయుడు రేవణ్ణ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా, ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ…న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. సభలో మెజారిటీ లేకుండా అధికారం కోసం అర్రులు చాచిన బీజేపీకి సుప్రీం తీర్పు చెంపపెట్టని ఆయన పేర్కొన్నారు. బల నిరూపణలో యెడ్యూరప్ప విఫలం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. మరో పక్క, పుట్టిన రోజు సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ శుక్రవారం ఉదయం తిరుచానూరు అమ్మవారిని దర్శనం కోసం ఆలయంలో ఉన్న సమయంలో దేవెగౌడకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

modigowda 18052018 2

ప్రధాని మోదీ ఫోన్‌ చేసిన విషయాన్ని దేవెగౌడ తనయుడు రేవణ్ణ ధృవీకరించారు. ‘మన మాజీ ప్రధాన మంత్రి శ్రీ దేవెగౌడ జీ తో మాట్లాడాను. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన ఆరోగ్యం, జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భాజపాకు, కాంగ్రెస్‌-జేడీఎస్‌లకు మధ్య అధికారం కోసం పోరాటం జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడకు ప్రధాని ఫోన్‌ చేసి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

modigowda 18052018 3

ఇది ఇలా ఉండగా, జేడీఎస్‌ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి గురువారం చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. 1984లో తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని చెప్పారు. ‘161 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కర్టాటకలోని నంది హిల్స్‌లో క్యాంప్‌కు వెళ్లాం. అసెంబ్లీలో బల నిరూపణ సమయం వరకూ ఒక్కరు కూడా మా నుంచి విడిపోలేదు. మీరు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి’ అని కుమారస్వామికి సలహా ఇచ్చారు. జేడీఎస్-కాంగ్రెస్‌ కూటమికి మెజారిటీ ఉన్నా తమను కాదని.. ప్రభుత్వ ఏర్పాటుకు అప్రజాస్వామికంగా గవర్నర్‌ బీజేపీకి అవకాశం ఇచ్చారని జేడీఎస్‌ నేత ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గవర్నర్‌ నిర్ణయం అప్రజాస్వామికమని దేశమంతా భావిస్తోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.

Advertisements