తనపై వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డీజీపీ ఠాకూర్ కౌంటరిచ్చారు. పోలీసులకు కులం ఉండదని, తమది ఖాకీకులమని అన్నారు. అసలు తన కులం, ఏపిలోనే లేదు అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు నిర్దేశం ప్రకారమే ప్రమోషన్ల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమోషన్లపై జ్యుడీషియల్‌ స్క్రూటినీ ఉంటుందని అన్నారు. డీజీగా ఉన్నప్పటి నుంచి తానేంటో అందరికీ తెలుసునని, నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పారు. ఈసీ నుంచి రాత పూర్వకంగా వస్తే సమాధానం ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ప్రమోషన్లు మెరిట్ ప్రకారమే ఇచ్చామని చెప్పారు. సీనియారిటీ లిస్టు.. హైకోర్టు ఆదేశాల మేరకే తయారు చేశామని, ఆ మేరకే ప్రమోషన్లు ఇచ్చామని డీజీపీ పేర్కొన్నారు.

dgp 05022019

సామాజికవర్గానికి చెందిన.. 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇచ్చారని నిన్న జగన్ ఆరోపించిన విషయం తెలిసందే. డీజీపీ ఠాకూర్‌ పోలీసు యంత్రాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే... డీజీపీ, ఇంటెలిజిన్స్‌ ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని జగన్‌ డిమాండ్ చేసిన విషయం విధితమే. కాగా ఇవాళ తిరుపతిలో ఆరు రాష్ట్రాల పోలీస్‌ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్‌ ఎన్నికల భద్రత విషయంపై చర్చలు జరిపినట్లుగా సమాచారం. మావోయిస్టుల కదలికలు, పోలీస్‌ సిబ్బంది తరలింపుపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది.

 

dgp 05022019

హోంమంత్రి ఫైర్.. జగన్‌ పై హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే జగన్ పోలీసుల మీద ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వస్తున్న ఆదరణను చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. సీఎం అవ్వలేనన్న భయంతోనే జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో డీజీపీ ముందున్నారని తెలిపారు. ప్రమోషన్స్ మీద అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒకే సామాజిక వర్గానికి పదోన్నతులు ఇచ్చామనడం సరికాదన్నారు. పదోన్నతులపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయినా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే అధికారులంతా ఎన్నికల సంఘం పరిధిలోనే పనిచేస్తారని పేర్కొన్నారు. జగన్‌ను కేసుల బయటపడేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని వివరించారు.

Advertisements