దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి, భాజపాకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తలపెట్టిన ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించింది. 40ఏళ్ల రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మరీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయనకు మద్దతిచ్చారు. ఆయనతోపాటు శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరి, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌, సమాజ్‌వాదీ నేతలు ములాయంసింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌లు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించగలిగే శక్తియుక్తులు గల నేత మీరేనని కితాబిచ్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చంద్రబాబుతో విడిగా సమావేశమై మద్దతు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రస్తుతం కనిపిస్తున్న పెడపోకడల నుంచి దేశాన్ని రక్షించడానికి భాజపా వ్యతిరేక కూటమిని కూడగట్టాలన్న లక్ష్యంతో దిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు ఉదయం నుంచి రాత్రి వరకు తీరికలేకుండా గడిపారు.

cbn 2112018 2

ఈ క్రమంలో భాజపాయేతర పక్షాల కూటమి ఏర్పాటుకు చేస్తోన్న ప్రయత్నాలకు మరో పార్టీ మద్దతు పలికింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కూటమిని స్వాగతించారు. అవినీతి, నిరంకుశ, విభజన శక్తులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. భాజపాయేతర పక్షాలు ఒకేవేదిక పైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కృషిచేస్తున్న రాహుల్‌ గాంధీ, చంద్రబాబులను అభినందిస్తున్నానన్నారు. వారు చేసే ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు.

cbn 2112018 3

భాజపా హయాంలో రాజ్యాంగ, స్వతంత్ర సంస్థలు తీవ్ర సంక్షోభలో కూరుకుపోయాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సేవ్‌ నేషన్‌ పేరిట నిన్న దిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ఎన్సీపీ, ఎన్సీ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతలందరితోనూ భేటీ అయ్యారు. భాజపాకు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటే లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యతకపై ఆయన కీలక మంతనాలు జరిపారు.

Advertisements