ఎన్నికల ఫలితాల ప్రకటనకు సమయం దగ్గరపడ్డ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, పంజాబ్‌, హరియాణాలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు వర్గాలు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం(ఈసీ).. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజవర్గ పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ అనే అభ్యర్థి స్థానికంగా ఉన్న ఓ స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

evm 21052019 1

దీంతో జిల్లా రిటర్నింగ్‌ అధికారి అక్కడికి చేరుకొని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా ఉండడానికి అనుమతించడంతో ఆందోళన విరమించారు. మరో ఘటనలో వారణాసికి సమీపాన గల చందౌలీ నియోజకవర్గంలో మంగళవారం ఉదయం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో భద్రపరచడాన్ని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు చరవాణిలో చిత్రీకరించారు. అలాగే పోలింగ్‌ ముగిసిన రెండు రోజుల తరవాత ఈవీఎంలను ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించడం వీడియోలో గమనించవచ్చు. దీనిపై స్పందించిన ఎన్నికల యంత్రాంగం.. వీడియోలో చూపించిన ఈవీఎంలు చందౌలీ నియోజవర్గానికి చెందిన రిజర్వ్‌ యూనిట్లని తెలిపారు.

evm 21052019 1

పోలింగ్‌ రోజున తరలించే క్రమంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా వాటిని స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడంలో ఆలస్యమైందని వివరించారు. మరో ఘటనలో దొమరియాగంజ్‌కు చెందిన జిల్లా ఎన్నికల అధికారి ఈవీఎంల తరలింపుపై సంబంధిత సిబ్బందిని ఫోన్‌లో ప్రశ్నిస్తుండగా.. అవతలివైపు నుంచి సరైన సమాధానం రాకపోవడం గమనార్హం. బిహార్‌, హరియాణా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. ‘‘హఠాత్తుగా ఈవీఎలంను తరలిస్తున్నారన్న వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి? వాటిని ఎవరు తరలిస్తున్నారు? ఈ క్రతువు ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? దీనిపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది’’ అని ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు.

Advertisements