రాష్ట్రంలోని పార్ట్‌టైమ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వో)కు ప్రభుత్వం సంక్రాంతి బొనాంజా ప్రకటించింది. వారి గౌరవ వేతనాన్ని నెలకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రెవెన్యూశాఖ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు (జీవో నం.10) జారీ చేసింది. పెంచిన వేతనం వెంటనే అమల్లోకి వస్తుందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీగా వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమకు ముందే సంక్రాంతి వచ్చిందని వీఆర్‌వోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

vro 09012019

ఈ వేతన పెరుగుదల కోసం వారు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్నారు. వారికి సర్వీసు రూల్స్‌, క్రమబద్ధీకరణే ఇక మిగిలాయి! వీటిని కూడా దశలవారీగా చేపట్టాలని రెవెన్యూశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రెవెన్యూశాఖలో రెగ్యులర్‌ వీఆర్‌వో, వీఆర్‌ఏలతోపాటు పార్ట్‌టైమ్‌ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. 2012, 2014 సంవత్సరాలలో ఏపీపీఎస్సీ ద్వారా భారీగా నియామకాలు చేపట్టారు. ఇందులో 4600 మంది వీఆర్‌ఏలే ఉన్నారు. నియామకాల నుంచి ఇప్పటి దాకా వారికి వేతన సవరణ జరగలేదు. దీనిపై వారు ప్రభుత్వానికి అనేక విన్నపాలు ఇచ్చారు.

vro 09012019

ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన తమకు వేతనాలు పెంచడంతోపాటు సర్వీసు రూల్స్‌ను వర్తింపచేసి క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. ఇదే విషయమై రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ద్వారా, ఆ తర్వాత వీఆర్‌వోల సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేతనం పెంచింది. ఇదిలావుండగా, వీరి సర్వీసు రూల్స్‌, ఇతర అంశాలపై రెవెన్యూశాఖ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారని తెలిసింది.

Advertisements