కర్నూలు జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి రాజీనామా చేశారు. పాణ్యం టికెట్ మాకే ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్‌ను ఆడిగామని, మొదట ఇస్తామన్నారు.. ఇప్పుడు లేదంటున్నారని గౌరు చరిత చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చే భరోసా జగన్‌లో కన్పించడం లేదని, గతంలో ముస్లింలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్‌ ఇవ్వలేదని, ఇప్పుడు తనకు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఎలా నమ్మాలని ఆమె ప్రశ్నించారు. ఈనెల 9న టీడీపీలో చేరుతున్నామని గౌరు చరిత దంపతులు ప్రకటించారు. జిల్లాలో వైఎస్‌ కుటుంబానికి పాతికేళ్లుగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు విధేయతగా ఉంటూ వస్తున్నారు.

gowru 01032019 1

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లో నడిచారు. ఆయన ఏది చెప్పినా కాదనలేదు. 1999 ఎన్నికల్లో గౌరు వెంకటరెడ్డి తొలిసారిగా వైఎస్‌ సూచన మేరకు నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ఓ హత్య కేసులో జైలుకు వెళ్లారు. 2004లో ఆయన సతీమణి గౌరు చరిత ఎమ్మెల్యే పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వుడు కావడంతో పోటీకి దూరంగా ఉన్నారు. వైఎస్‌ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు రావడం, అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గౌరు దంపతులు వైఎస్‌ కుటుంబానికి, జగన్‌కు మద్దతుగా నిలిచారు. జగన్‌ స్థాపించిన వైసీపీలో చేరి జిల్లాలో ఆ పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పాణ్యం వైసీపీ అభ్యర్థిగా గౌరు చరిత పోటీ చేసి గెలుపొందారు.

gowru 01032019 1

పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితకు జగన్ టికెట్ నిరాకరించడంతో గౌరు దంపతులు తెలుగుదేశంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పాణ్యం, కల్లూరు మండలాల కార్యకర్తలతో గౌరు దంపతులు సమావేశం అయ్యారు. టీడీపీలోకి వెళ్లడంపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. త్వరలోనే గౌరు దంపతులు సైకిలెక్కనున్నట్లు సమచారం. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరు నెలల క్రితం బీజేపీని వీడి వైసీపీలో చేరారు. ఆయనకే వైసీపీ టికెట్‌ ఖరారైందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ వచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని మరొకరికి టికెట్‌ ఇవ్వరని గౌరు కుటుంబం చెబుతూ వచ్చింది. కాటసాని వర్గం తమకే టికెట్‌ అంటూ నియోజకవర్గంలో వేగం పెంచుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర ముగించి హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌ను గౌరు దంపతులు కలిసి టికెట్‌పై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని, ఎమ్మెల్సీ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఒకసారి నియోజకవర్గాన్ని వదులుకుంటే ప్రజాబలం కోల్పోతామని, సీటు తమకే ఇవ్వాలని గౌరు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. జగన్‌ను నమ్ముకుంటే ఇలా అన్యాయం చేస్తారని అనుకోలేదని గౌరు వర్గీయులు మథనపడుతూ వచ్చారు.

Advertisements