2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరనుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రాష్ట్రంలో స్థాపించనున్న గ్లోబల్‌ ఐటీ డెవల్‌పమెంట్‌, శిక్షణ కేంద్రాల డిజైన్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం సచివాలయంలో కలిసిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ ఈ విషయాన్ని వెల్లడించారు. విజయవాడ విమానాశ్రయం దగ్గర నిర్మించే హెచ్‌సీఎల్ భవన ఆకృతులపై ముఖ్యమంత్రికి శివనాడార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్యాంపస్ నిర్మాణ విశేషాలను వివరించారు.

hcl 29112017 2

కలంకారీ నేత, కొండపల్లి బొమ్మలు ఇలా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించేలా, అమరావతి బౌద్ధ శిల్ప శైలిలో హెచ్‌సీఎల్ నూతన భవంతుల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయని శివనాడార్‌ తెలిపారు.ఆకృతులపై ముఖ్యమంత్రి చాలా సంతోషం వ్యక్తం చేశారు... అమరావతి భావనలు కూడా ఇలా ఐకానిక్ గా ప్లాన్ చేస్తున్నామని, మీరు కూడా ఇదే థీంతో ఉన్నారని అన్నారు... ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని శివనాడార్‌కు చెప్పారు.

hcl 29112017 3

సుమారు 50 ఎకరాల్లో హెచ్‌సీఎల్‌ క్యాంప్‌సలు కొలువుదీరనున్నాయి. 2019 జూన్‌కల్లా గన్నవరంలోని హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ సిద్ధమవుతుంది. ఐటీలో ఏపీ నాయకత్వం వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమరావతి, విజయవాడలో సుమారు 50 ఎకరాల్లో రెండు క్యాంపస్‌లు నెలకొల్పుతున్న హెచ్‌సీఎల్ వీటి నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టనుంది. ఇందుకోసం మొత్తం రూ. 750 కోట్లు ఖర్చుపెట్టనుంది. ఇవి పూర్తయితే 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Advertisements