జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో రకరకాల పిటిషన్‌లతో నిందితుల వైపు నుంచి జాప్యం జరుగుతోందంటూ ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాల్లో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పునీత్‌ దాల్మియా హాజరు మినహాయింపు కోరుతూ, తన తరఫున న్యాయవాదిని విచారణకు అనుమతించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఇటీవల జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి వెలువరించిన తీర్పు ప్రతి చేతికందింది. ప్రతి శుక్రవారమూ కోర్టుకు హాజరుకావడం పునీత్‌దాల్మియాకు ఇబ్బందికరమే కావచ్చని, అయితే ఏదైనా ఒకరు ఒక రోజు మినహాయింపు కోరే అవకాశం సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద అవకాశం ఉందని, అలాకాకుండా ప్రతి విచారణకూ మినహాయింపు కోరుతూ సెక్షన్‌ 205 కింద పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

jagan 3000920118 2

దాల్మియాపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవన్నారు. దాల్మియా సిమెంట్స్‌కు లీజులు కట్టబెట్టడంలో వై.ఎస్‌. ప్రభుత్వం సహకరించినందుకు జగన్‌ కంపెనీల్లో ఒకసారి రూ.20 కోట్లు, మరోసారి 70 కోట్లు పెట్టుబడుల రూపంలో చెల్లించారన్నారు. మొత్తం అవినీతి రూ.139 కోట్ల దాకా ఉందన్నారు. రఘురాం సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్స్‌ వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.139 కోట్లలో రూ.55 కోట్లు హవాలా రూపంలో జగన్‌కు అందజేసినట్లు చెప్పారన్నారు. రాష్ట్రానికి ఆర్థిక నష్టాన్ని చేకూర్చే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కోర్టు సాధారణ కేసుల్లోలాగా పునీత్‌ దాల్మియాకు హాజరు మినహాయింపునకు అనుమతించలేదన్నారు.

jagan 3000920118 3

ఇదే అంశంపై జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కేసులోని ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఇదే హైకోర్టు కొట్టివేసిందన్నారు. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితుల వ్యక్తిగత హాజరుకు న్యాయస్థానాలు ఆదేశించడం రాజ్యాంగంలోని అధికరణ 21 కింద ప్రాథమిక హక్కులను హరించినట్లు కాదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులతో కలిసి పునీత్‌దాల్మియా కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నందున కేసును తీవ్రమైనదిగానే పరిగణించాలన్నారు. వైఎస్‌ జగన్‌ వర్సెస్‌ సీబీఐ కేసులో సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు పూర్తిగా మేజిస్ట్రేట్‌ విచక్షణపైనే ఆధారపడి ఉంటుందన్నారు.

Advertisements