ఇప్పటికే లోకేష్, అఖిల ప్రియ లాంటి యువ మంత్రులతో ఉన్న ఏపి క్యాబినెట్ లోకి, మరో యువ నాయకుడు వచ్చి క్యాబినెట్ లో చేరనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రేపు జరగనున్న విషయం తెలిసిందే. కేబినెట్‌లోకి ముస్లిం, ఎస్టీ వర్గాలకు చెందిన ఇద్దరిని తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ను, మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. శ్రావణ్‌ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో ఇంజినీరింగ్‌ చదివారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వనున్నారు. ఆయన సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు.

cbn 010112018 2

సర్వేశ్వరరావుతో పాటు, మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ కుమారుడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమించనున్నారు. చెప్పిన మాట ప్రకారమే, చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. కిడారి శ్రావణ్‌కుమార్‌ స్వస్థలం... విశాఖ జిల్లా పెదబయలు మండలం నడింవాడ గ్రామం. ఆయన తండ్రి కిడారు సర్వేశ్వరరావు ఎమ్మెల్సీగా, అరకు ఎమ్మెల్యేగా, శాసనసభలో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. శ్రావణ్‌కుమార్‌ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో ఇంజినీరింగ్‌ చదివారు. సివిల్‌ సర్వీసెస్‌కి ఎంపికవడం ఆయన లక్ష్యం. దాన్ని సాధించేందుకు దిల్లీలో ఉంటూ సివిల్స్‌ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. తండ్రి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో... ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రాజకీయాల్లోకి వస్తున్నారు. శ్రావణ్‌ 1990 జూన్‌ 14న జన్మించారు. ఎనిమిదో తరగతి వరకు పెదబయలులోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో చదువుకున్నారు. విశాఖలో ఇంటర్మీడియెట్‌ చదివారు.

cbn 010112018 3

ఫరూక్‌ని మంత్రివర్గంలోకి తీసుకుంటే శాసనమండలి ఛైర్మన్‌గా షరీఫ్‌కి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా... ఆయన సేవల్ని పార్టీ కోసం వినియోగించుకోవాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. షరీఫ్‌ ఇప్పటికే శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పదవిలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ప్రభుత్వం ఏర్పడ్డాక... 2017 ఏప్రిల్‌ 2న మొదటిసారి మంత్రి వర్గ విస్తరణ చేశారు. ఐదుగుర్ని తొలగించి కొత్తగా 11 మందికి చోటు కల్పించారు. ఇప్పుడు రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే వారికి ఆయా వర్గాల సంక్షేమానికి చెందిన శాఖలనే కేటాయిస్తారని అంటున్నారు. ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమం, శ్రావణ్‌కు గిరిజన సంక్షేమ శాఖలను ఇస్తారు. కొందరు మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు.

Advertisements