గుంటూరులో ప్రప్రథమంగా ఐటీ(ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ) కంపెనీ ప్రారంభం కాబోతోంది. వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టేందుకు సంసిద్ధమయ్యాయి. డెస్కుటాప్‌లకు సంబంధించి ఏఎండీ మైక్రో ప్రాసెసర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇక్కడ నిర్వహించబోతున్నట్లు ఆయా సంస్థలు జిల్లా యంత్రాంగానికి నివేదించాయి. ఇందులోనే వేద ఐఐటీ సంస్థ పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి మేరకు నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో ఏడు అంతస్థుల భవనంలో ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి చేశారు.

guntur 26062018 2

ఈ నెల 29వ తేదీన ఉదయం దీనిని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ హాజరుకానున్నారని కలెక్టర్‌ కోన శశిధర్‌కు ప్రభుత్వవర్గాల నుంచి సమాచారం అందింది. అమరావతి రాజధాని ప్రాంతానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు సీఎంతో పాటు మంత్రి లోకేష్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరికి పై డేటా సెంటర్‌ని తీసుకొచ్చి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. రెండు రోజుల క్రితం రాజధానిలోని రాయపూడిలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేశారు. 36 అంతస్థులలో నిర్మాణం జరగనున్న ఆ టవర్‌ ఐటీ కంపెనీలకు హబ్‌గా మారనుంది.

guntur 26062018 3

తాజాగా గుంటూరు నగరానికి తొలిసారిగా ఐటీ కంపెనీని తీసుకురాబోతోన్నారు. ఇందులోనూ వందల సంఖ్యలో సాఫ్టువేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. 24 వేల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నిర్మించిన వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు ఒకే టవర్‌లో కార్యకలాపాలాను ప్రారంభించనున్నాయి. వచ్చే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు, అంతకంటే గంట ముందే లోకేష్‌ రానున్నారని సమాచారం రావడంతో ఆదివారం కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ ఎస్‌పీ విజయారావు, కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీకేష్‌ లత్కర్‌ బాలాజీరావు ఇతర అధికారులు ఇన్వేకాస్‌ టవర్‌ని సందర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యానగర్‌ ఒకటో లైనులో ఆక్రమణలు తొలగించి కొత్తగా బీటీ లేయర్‌తో రోడ్డుని అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

Advertisements