ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ఆప్తుడి నివాసంపై ఐటీ దాడి జరగడం మంత్రులతో పాటు పలువురు అధికారులలో దడపుట్టిస్తోంది. సీఎం కుమారస్వామి వ్యవహారాలను పర్యవేక్షించే ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ సునీల్‌ నివాసంతో పాటు కార్యాలయంపైనా ఏక కాలంలో దాడి జరిగింది. సీఎం కుమారస్వామిని మానసికంగా దెబ్బతీసేందుకే ఈ ఐటీ దాడి జరిగిందని విమర్శలు జోరందుకున్నాయి. ఈ మేరకు విధానసౌధ పోలీసు స్టేషన్‌లోను ఫిర్యాదు చేశారు. దాడి ఆరంభమైన కాసేపటికే కొందరు కీలక మంత్రులు నేరుగా సీఎం కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కేవలం ఛార్టెడ్‌ అకౌంటెంట్‌పై దాడితోనే సరిపెట్టుకుంటారా? లేక మా పైనా దాడులు కొనసాగునున్నాయా అని పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

kumaraswamy 24082018 2

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు సాగాయని ప్రస్తుతం జేడీఎస్‌ ముఖ్యులపై గురిపెట్టారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కుమారస్వామి కుటుంబీకులు పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. కుటుంబీకులకు ఇబ్బంది కలిగించడమే ఐటీ దాడి ఉద్దేశమని పార్టీ సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ సునీల్‌ నివాసమైన జేపీనగర్‌తో పాటు గుట్టహళ్ళిలోని కార్యాలయంలోను పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏమాత్రం ఆధారాలు లభించినా ప్రభుత్వంలోని కీలకులకు ఇబ్బంది తప్పదనిపిస్తోంది. అధికారం దక్కలేదన్న అక్కసుతోనే బీజేపీ ఈ కుట్రపన్నిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

 

Advertisements