వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్‌ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్‌ కటౌట్‌ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. తమది పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని పరిస్థితి తమదని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితుల్లో తన సోదరుడు ఎందుకిలా చేశాడో అర్థంకావడంలేదంటూ వాపోయారు.

jaganfan 25102018 2

నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకకు చెందినవాడు. అతడు ఏడాదికాలంగా విశాఖ విమానాశ్రయంలో ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రేపు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు పాదయాత్రకు విరామమిచ్చిన జగన్‌.. ఈ రోజు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని లాంజ్‌లో కూర్చొన్నారు. అక్కడే ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తి జగన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్‌ భుజానికి గాయమైంది. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జగన్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో జగన్‌ హైదరాబాద్‌చేరుకొని ఆస్పత్రిలో చేరారు.

jaganfan 25102018 3

విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటనను ఏపీ డీజీపీ ఆర్పీ రాకూర్ మీడియాకు వివరించారు. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని తెలిసిందని, పబ్లిసిటీ కోసమే అతడు దాడిచేసినట్లు అనిపిస్తోందని ఆయన చెప్పారు. ‘‘మధ్యాహ్నం 12 గంటలకు జగన్ వీఐపీ లాంజ్‌కు వచ్చారు. అక్కడి సర్వర్ అందరికీ టీ ఇచ్చాడు. 2.30 గంటలకు మళ్లీ కాఫీ ఇచ్చాడు. ఆ తర్వాత జగన్‌తో సెల్ఫీ దిగాలని అడిగాడు. ఎడమ చేతితే సెల్ఫీ తీసుకుంటూనే.. కుడి చేతితో జేబులో నుంచి కత్తి తీశాడు. కత్తితో జగన్ ఎడమ భుజంపై దాడి చేశాడు. అక్కడున్న సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేశ్‌కుమార్‌తో పాటు జగన్ గన్‌మెన్‌లు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ జరగుతోంది. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. జగన్‌కు ఫస్ట్‌ఎయిడ్ చేశాక విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు." అని డీజీపీ పేర్కొన్నారు.

Advertisements