ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తూ వైకాపా అధ్యక్షులు, ప్రతిపక్షనేత వై.యస్‌ జగన్‌ అనంతపురం వైకాపా సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలక్షన్‌ కమీషన్‌ కు పిర్యాదు చేసింది. రానున్న ఎన్నికల్లో ఓటుకు 5 వేలు అడగాలన్న జగన్‌ వ్యాఖ్యలను టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు చుక్కపల్లి రమేష్‌, తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణయ్య, పట్టాభి గార్లు ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ఓటుకు 5 వేలు డిమాండ్‌ చేసి తీసుకోవాలని, ఓటుమాత్రం వైసీపీకి వేయాలని జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమ నిబంధనలకు తూట్లుపొడిచే విధంగా ఉందని తెలిపారు.

ec 12022019

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 (ది రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్స్‌ యాక్ట్‌)లోని సెక్షన్స్‌ 8జు, 9, 123 ప్రకారం జగన్‌ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాని విజయవాడలో కలిసి పిర్యాదు చేశారు. ఎన్నికలు స్వేచ్చగా, అవినీతి రహితంగా నిర్వహించటంలో జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద గొడ్డలిపెట్టని చెప్పారు. మూడు నెలల్లో జగన్‌ ముఖ్యమంత్రి అవుతానని, అధికారంలో వచ్చిన వెంటనే వైసీపీ నాయకులపై పెట్టిన కేసులు తొలగిస్తానని జగన్‌ చెప్పడం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే అవుతుందని చెప్పారు.

ec 12022019

ఇలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంగిస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్‌ పై చర్య తీసుకుని రాబోయే ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో వుండి జగన్‌ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. సోమవారం అనంతపురం నగర శివారులో బూత్‌కమిటీ సభ్యులు, కన్వీనర్లతో సమర శంఖారావ సభ నిర్వహించిన జగన్, రానున్న ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలు అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలు తీసుకోండి. రూ.3 వేలు కాదు రూ.5 వేలు ఇవ్వాలని అడగండి. అవినీతి సొమ్ము తీసుకుంటే ఏ దేవుడూ చంద్రబాబుకు ఓటేయమని చెప్పడు’ అన్నారు.

Advertisements