అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్, విజయసాయి రెడ్డి, ప్రతి శుక్రవారం కోర్ట్ విచారణకు వెళ్ళాల్సిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కోర్ట్ సెలవులు కావటంతో, విచారణ జరగలేదు. అయితే ఇప్పుడు కోర్ట్ కి సెలవలు అయిపోవటంతో, ఇకనుంచి మళ్ళీ ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. అయితే, ఎన్నికల్లో గెలుపొంది ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, విధి నిర్వహణలో నిమగ్నమైన నేపథ్యంలో కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు నేర న్యాయ స్మృతి (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 317కింద ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదేకేసులో రెండో నిందితుడిగా ఉన్న వి.విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, విజయవాడ/తాడేపల్లిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం ఉన్నందున కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు.

cbi 08062019

వీరిద్దరి పిటిషన్లను న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు అనుమతించారు. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు. ఆ ఆరు చార్జిషీట్లనూ కలిపి విచారించండి... సీబీఐ 11చార్జిషీట్లు దాఖలు చేసిందని, ఇందులో మొదటి 5 చార్జిషీట్లలో దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లను కలిపి విచారించేందుకు ఈ కోర్టు అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసిందని జగన్‌ తరఫు న్యాయవాది నివేదించారు. అన్ని చార్జిషీట్లలో పేర్కొన్న ఆరోపణలు ఒకేవిధంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో మిగిలిన 6 చార్జిషీట్లకు సంబంధించిన డిశ్చార్జ్‌ పిటిషన్లను కలిపి విచారించాలని తాము దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. దీనిపై పూర్తిగా విచారించాక నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, ఈడీ దాఖలుచేసిన కేసులో ఇండియా సిమెంట్స్‌ అధినేత, బీసీసీఐ మాజీ చైర్మన్‌ శ్రీనివాసన్‌తోపాటు ఇతర నిందితులు ఈడీ కోర్టుకు హాజరయ్యారు.

Advertisements