భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ తోసిపుచ్చింది. మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో నిజం లేదని జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సీజేఐని ఇరికించేందుకే ఈ విధమైన ఆరోపణలు చేశారని తెలిపింది. ఈ అంశంపై గత కొన్నిరోజులుగా విచారణ జరిపిన కమిటీ మహిళా ఉద్యోగినిని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఆమె ఇచ్చిన సమాధానాలను, వార్తా పత్రికలకు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలను పరిశీలించిన మీదట ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.

ranjan 06052019

జస్టిస్‌ గొగొయ్‌ దగ్గర పనిచేసిన మాజీ జూనియర్‌ అసిస్టెంట్‌ ఒకరు తనపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దీనిపై విచారణకు జస్టిస్‌ గొగొయ్‌ నేతృత్వంలోనే ఓ ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై పలు అభ్యంతరాలు రావడంతో అంతర్గత దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలపై జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటైన అంతర్గత విచారణ కమిటీలో ఇందు మల్హోత్ర,ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నాయి.గొగొయ్ పై వచ్చిన ఆరోపణలల్లో వాస్తవం లేదంటూ త్రిసభ్యధర్మాసనం కొట్టిపారేసింది.

Advertisements