కడప, జిల్లాలో టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా దాదాపు రెడీ అయినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పులివెందుల నుంచి సతీష్‌రెడ్డి, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి, కడప లోక్‌సభ నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే లైన్‌క్లియర్‌ చేశారు. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలు, రాజంపేట లోక్‌సభ అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత జిల్లా నేతలతో చర్చలు సాగిస్తున్నారు. కడప లోక్‌సభ పరిధిలో నేతలతో సమీక్ష జరిపేందుకు బుధవారం ఉదయం 7.30 గంటలకు అమరావతిలోని ప్రజావేదికలో జరిగే సమావేశానికి హాజరుకావాలని జిల్లా నేతలకు పిలుపు అందింది. మంగళవారం సాయంత్రమే నేతలంతా అమరావతికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల తరువాత రాజంపేట లోక్‌సభ పరిధిలోని కడప, చిత్తూరు జిల్లాల నేతలు హాజరుకావాలని కోరారు. అయితే మంత్రి ఆది రాత్రి 9 గంటలకు అమరావతికి చేరుకోవడంతో మొదట కడప, ఆ తరువాత రాజంపేట లోక్‌సభ సమీక్షలు జరపాలని భావించారు. సీఎం వేరే జిల్లాల సమీక్షలో బిజీగా ఉండడంతో కడప సమీక్షను వాయిదా వేసి రాజంపేట సమీక్ష ఈ రోజు జరిపారు.

kadapa 21022019

రాజంపేట పార్లమెంట్‌ నియోజవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. పీలేరు-నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట-చెంగల్రాయుడు, రాయచోటి-రమేష్ రెడ్డి, పుంగనూరు-అనూషరెడ్డి, రైల్వే కోడూరు-నరసింహ ప్రసాద్ పేర్లను చంద్రబాబు ప్రకటించారు. మదనపల్లె, తంబాలపల్లె సీట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కడప లోక్‌సభ పరిధిలోని పులివెందుల, జమ్మలమడుగు అభ్యర్థులు ఖరారుకావడంతో మైదుకూరు అభ్యర్థి ఎంపికపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి మైదుకూరు నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మైదుకూరు ఇన్‌చార్జిగా వున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌ను ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై గురువారం చర్చించనున్నారు.

kadapa 21022019

కడప సెగ్మెంట్‌ నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్‌కు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి పేర్లను, బద్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సిఫారసు మేరకు లాజరస్‌ పేరును పరిశీలిస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో అధికారికంగా అభ్యర్థుల పేరుతో తొలిజాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సమీక్షలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరనాధ్‌రెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జయరాములు టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, టీడీపీ నేతలు బత్యాల చెంగల్‌రాయుడు, వరదరాజులరెడ్డి, విజయమ్మ, లింగారెడ్డి పాల్గొన్నారు.

Advertisements