తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజయవాడ కనకదుర్గమ్మను గురువారం ఉదయం దర్శించుకునేందుకు రానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కు పుడకను సమర్పించుకుంటానని కేసీఆర్‌ మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు రానున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి దుర్గగుడి అధికారులకు అధికారికంగా బుధవారం సమాచారం అందింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత నాలుగేళ్లుగా కేసీఆర్‌ దుర్గగుడికి వస్తారంటూ ప్రతి దసరా సమయంలో ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ.. అధికారికంగా ఎప్పుడూ ఖరారు కాలేదు. ఎట్టకేలకు కేసీఆర్‌ దుర్గగుడి పర్యటన ఖరారైంది. విజయవాడలో కేసీఆర్‌ రెండు గంటలు ఉండనున్నారు.

kcr 28062018 3

పర్యటన ఏర్పాట్లకు సంబంధించి కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, సంయుక్త పోలీసు కమిషనర్‌ కాంతి రాణాటాటా ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు అధికారుల సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో కుటుంబంతో కలిసి కేసీఆర్‌ బయలుదేరతారు. గన్నవరం విమానాశ్రయానికి 12గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ వెటర్నరీ కళాశాల గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కొద్దిసేపు సేదదీరుతారు. అనంతరం రోడ్డు మార్గంలో దుర్గగుడికి చేరుకోనున్నారు. దుర్గగుడిలో కేసీఆర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

kcr 28062018 2

దుర్గగుడి ఈవో పద్మ, పాలక మండలి ఛైర్మన్‌, సభ్యులు కలిసి కేసీఆర్‌ను స్వాగతించనున్నారు. అనంతరం కేసీఆర్‌ 40 నిమిషాలు దుర్గగుడిలో ఉంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకోనున్నారు. కేసీఆర్‌ రాక సందర్భంగా ఇప్పటికే విజయవాడ పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దుర్గగుడి వరకూ కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ను సైతం బుధవారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారిక భద్రత, ప్రొటోకాల్‌ సిబ్బంది ఉదయాన్నే దుర్గగుడికి చేరుకుంటారు.

Advertisements