తాను తెదేపాను వీడే ప్రసక్తే లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్లమెంటరీ పార్టీ పదవుల వ్యవహారంలో నాని అలకబూనిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన్ను తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. కేశినేనితో ఏకాంతంగా మాట్లాడిన చంద్రబాబు తెదేపా ఎంపీలంతా సీనియర్‌, జూనియర్‌ అనే తేడాలు లేకుండా పార్లమెంట్‌లో కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో నాని మాట్లాడుతూ లోక్‌సభాపక్ష ఉపనేత, విప్‌ పదవులు వద్దని.. పార్టీ కోసం పనిచేస్తానని చెప్పినట్లు సమాచారం. గత ఐదేళ్లలో జరిగిన కొన్ని ఘటనలు, తన అసంతృప్తిగా కారణాలను కేశినేని వివరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కృష్ణా జిల్లాలోని పరిస్థితులపైనా చంద్రబాబుతో ఆయన చర్చించినట్లు తెలిసింది.

nani 05062019 1

పార్లమెంటరీ పార్టీ పదవుల విషయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అలకబూనారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నివాసంలో కేశినేని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో సమావేశమయ్యారు. కేశినేనితో ఏకాంతంగా మాట్లాడిన చంద్రబాబు.. పార్లమెంటు సమావేశాల్లో కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా ముగ్గురూ కలిసి సమస్యలపై గళం వినిపించాలని చెప్పారు. సమావేశం అనంతరం గల్లా జయదేవ్‌ మీడియాతో మాట్లాడారు. తాము ముగ్గురమూ రెండోసారి ఎంపీలుగా గెలిచిన వాళ్లమేనని.. తమకు సీనియర్‌, జూనియర్‌ అనే తేడా ఏమీ లేదని చెప్పారు. తన పదవి మారుస్తానంటే తనకెలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు. లోక్‌సభాపక్ష నేతగా ఉండటానికి తాను ఇష్టపడ్డానని అయితే.. ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సుజనాచౌదరి తప్పుకోవటంతోనే తనకు ఆ పదవి వచ్చిందని తెలిపారు. తనకు ఆసక్తి ఉన్నందునే ఆ పదవి తీసుకున్నానని జయదేవ్‌ వివరించారు. ప్రస్తుతానికి కేటాయించిన పదవుల్లో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisements