ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌తో సెప్టెంబర్‌లో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బయటపెట్టారు. చంద్రబాబు ఒత్తిడితో లగడపాటి సర్వే ఫలితాలను మార్చారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై.. లగడపాటి స్పందించారు. డిసెంబర్ 7 వ తేదీ సాయంత్రమే మాట్లాడతానని చెప్పిన లగడపాటి.. కేటీఆర్ వ్యాఖ్యలతో ముందే మీడియా ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 16న బంధువుల ఇంట్లో కేటీఆర్ తనను కలిశారని చెప్పారు. 23 నియోజకవర్గాల్లో ప్రజానాడి ఎలా ఉందో చెప్పాలని కేటీఆర్ తనను రిక్వెస్ట్ చేశారని, దాంతో ఉచితంగానే సర్వే చేసి నవంబర్ 11న కేటీఆర్‌కు వాట్సాప్ ద్వారా రిపోర్ట్ పంపించానన్నారు. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, అభ్యర్థులను మార్చకపోతే నష్టం వచ్చే అవకాశం ఉందని తాను కేటీఆర్‌కు ముందే చెప్పానని లగడపాటి తెలిపారు.

lagdaapati 52018

తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. సర్వేకు సంబంధించి కేటీఆర్ పంపిన ట్విట్టర్ మెసేజ్‌లపై ఆయన మాట్లాడుతూ ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని... అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.

 

వీలుంటే పొత్తులతో వెళ్లాలని చెప్పానని.. అయితే కేటీఆర్‌ సింగిల్‌గానే వెళ్తామని చెప్పారని ఆయన తెలిపారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని అన్నారు. కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. కేటీఆర్‌ కోరిన 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉందని తెలిపారు. ‘మీ నాన్న గారు పాడు చేసిన వాతావరణాన్ని.. మీరు బాగు చేశారని కేటీఆర్‌కు మెసేజ్‌ చేశా’నని లగడపాటి అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు.

Advertisements