తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్‌కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో సెల్ఫీలు వారు దిగారన్నారు. గజ్వేల్‌లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్..’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్‌లో ఎవరు పోతారో..? ఎవరు గెలుస్తారో...? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.

kcrlagadapati 0512018

కాగా.. చంద్రబాబును వదులుకోవద్దని కేటీఆర్‌కు తాను స్పష్టంగా చెప్పానని లగడపాటి అన్నారు.. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. కూటమికి అనుకూలంగా అబద్ధపు సర్వేలు వెల్లడిస్తున్నారంటూ మంగళవారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదనీ, వ్యక్తిత్వం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరమన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారన్నారు. ఆ సమయంలో సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగారన్నారు.

 

kcrlagadapati 0512018

‘నవంబర్‌ 28 తర్వాత నాకు అనేక రిపోర్టులు వచ్చాయి. ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పా.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉంది. ఈ ఉదయమే సమాచారం వచ్చింది. పోటాపోటీగా లేనప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనబడదు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో.. ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. కేటీఆర్‌కు, నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఈ ఐదేళ్లలో కేటీఆర్‌ని నేను ఎప్పుడూ కలవలేదు. నేను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదు. జిల్లాల వారీగా అనుకూలంగా ఉన్న స్థానాలు చెప్పా. సెప్టెంబర్ 20న టీఆర్ఎస్‌కు అనుకూలంగా..సర్వే ఇచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? నేను తెలంగాణకు వ్యతిరేకం అంటే.. కేటీఆర్‌కు రిపోర్టులు ఎందుకు పంపుతా..?’ అని లగడపాటి ప్రశ్నించారు.

Advertisements