మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ‘శక్తి’ బృందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సురక్షితమైన, ఆనందకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తామని డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో చేరువ కార్యక్రమాల్లో భాగంగా ప్రవేశపెట్టిన ‘శక్తి’ టీమ్‌ను సోమవారం సాయంత్రం విజయవాడలో ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం, శిక్షణ, అంకితభావంతో పనిచేసేలా మహిళలతో ఒక బలమైన శక్తి టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందానికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆత్మరక్షణ పద్ధతులు, ఈత, డ్రైవింగ్‌ తదితర అంశాల్లో పూర్తిగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

shakti 18122018 2

శక్తి బృందం మహిళలకు పూర్తి భరోసా ఇస్తుందని వివరించారు. వివిధ జిల్లాల్లో రకరకాలుగా పిలిచే పోలీసింగ్‌ను ఇక నుంచి శక్తిగా పిలుస్తారన్నారు. నేటి నుంచి ఈ బృందమే ప్రజల వద్దకు వెళ్తుందని తెలిపారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు త్వరలో ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం శక్తి లోగోను డీజీపీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) హరీష్‌గుప్తా, అదనపు డీజీపీ (సీఐడీ) అమిత్‌గర్గ్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, విజయవాడ క్రైం డీసీపీ, శక్తి బృందం ఇన్‌ఛార్జి బి.రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisements