ప్రధాని నరేంద్ర మోదీని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం దిల్లీ చేరుకున్న నరసింహన్‌ ప్రధాని మోదీతో కొద్దిసేపు భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలను ఆయన ప్రధానికి వివరించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ నిర్వహణలో ఉన్న భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన అంశం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన భేటీ అంశాలు ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. అనంతరం కేంద్ర ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్‌, సుబ్రహ్మణ్యం జయశంకర్‌, హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిలను గవర్నర్‌ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా నరసింహన్‌ సమావేశమైనట్లు సమాచారం. సోమవారం రాత్రి తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాకులో ఆయన బస చేశారు.

Advertisements