కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం ఆహ్వానం మేరకు, అమరావతి వచ్చి చంద్రబాబుని కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో, ఉండవల్లి పలు ఆసక్తికర విషయం చంద్రబాబుకి చెప్పారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలనే ప్రధాన ఆయుధంగా మలచుకొని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పోరాటం చేయాలని సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూచించారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ సుప్రీంకోర్టులో తాను వేసిన వ్యాజ్యం, రాష్ట్రపతి, ప్రధానికి గత ఏడాది తాను రాసిన లేఖల ప్రతులనూ బాబుకు అందజేశారు. రాష్ట్ర విభజన అంశంపైనా, దాని పై మోదీ చేసిన వ్యాఖ్యలపైనా పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని సీఎంకు సూచించారు.

undavalli 17072018 2

‘‘తలుపులు మూసి, రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందంటూ 2018 ఫిబ్రవరి ఏడున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయం చేయాల్సిన వ్యక్తే మనకు అన్యాయం జరిగిందని అంగీకరిస్తున్నారు. ఆ అన్యాయాన్ని వారితోనే చెప్పించేందుకు ఈ పార్లమెంటు సమావేశాలే మంచి అవకాశం. అందుకే ఈ అంశంపై ప్రశ్నలు వేయడంతో పాటు జీరో అవర్‌ లో చర్చకు, స్వల్పకాలిక చర్చకు అవకాశమివ్వాలంటూ పట్టుబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పాను’’ అని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు.

undavalli 17072018 3

ఇదే విషయం ఉండవల్లి బయటకు వచ్చి మీడియా తో చెప్పారు ‘‘లోక్‌సభ నియమాలన్నింటినీ ఉల్లంఘించి..ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందినట్లు 2014 ఫిబ్రవరి 18న ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం. దీనిపై లోక్‌సభలో చర్చ లేవనెత్తాలని నేను మొదటి నుంచీ చెబుతున్నా. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయగా.. ఏమేం ఆధారాలు, పత్రాలున్నాయో తీసుకొచ్చి వివరించమని ఆయన కోరారు. ఆ మేరకు ముఖ్యమంత్రిని కలిశా. నేను రాసిన పుస్తకం, ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలు, న్యాయస్థానంలో వేసిన ప్రమాణపత్రం ప్రతులు అందించా. ప్రధాని మోదీ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభలో ఎలా వ్యవహరిస్తే బాగుంటుదనే దానిపై కొన్ని సూచనలు, సలహాలిచ్చా. ఇక ఆలస్యం చేయొద్దని చెప్పా. మా భేటీ ప్రభావం రాబోయే సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభలో కనిపిస్తుందనుకుంటా. మా భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యమూ లేదు. నేను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేను...భవిష్యత్తులో కూడా ఎందులోనూ చేరను.’’ అని వ్యాఖ్యానించారు.

Advertisements