‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అని అన్నారు పెద్దలు. పంచేంద్రియాల్లో కంటి చూపు ప్రాముఖ్యతను తెలిపారు. ప్రస్తుత సమాజంలో కంటి సంబంధిత సమస్యల కారణంగా ఎందరో అభాగ్యులు కంటి చూపునకు దూరమవుతున్నారు. నేత్ర సమస్యలు నగరాలతో పాటు గ్రామాల్లోనూ ఉన్నాయి. నగరాల్లో ఆర్టిఫిషియల్‌ లైటింగ్‌, స్క్రీన్‌ వాచ్‌ కారణంగా కంటి సమస్యలు వస్తున్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాలు కారణంగా గ్రామాల్లో రైతులు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షల మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దాసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి ఉంచింది. అయితే ఇవి కేవలం పట్టణ ప్రజలకు మాత్రమే అందుతున్నాయి.

eye 09102018 2

ఈ క్ర‌మంలో గ్రామీణులకూ నేత్ర సంబంధిత వైద్య సేవలందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీహెచ్‌సీల్లోనూ(కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు) ముఖ్యమంత్రి ఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సెల్ఐటి న్యూస్‌ ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 115 కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాల ద్వారా గ్రామీణుల కంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీకి 3,98,546 వరకూ ఆర్డర్ ఇచ్చారు. వాటిలో ఇప్పటికే 3,11,276 మందికి కళ్లజోళ్లను ఉచితంగా అందజేశారు. మరో 87,270 మందికి త్వరలో కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. టెలీ రేడియాలజీ మాదిరిగానే ఈ ప్రాజెక్టును కూడా అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. రోగి సమాచారం మొత్తం సేకరించి కంప్యూటర్‌లో నమోదు చేసుకుని ఆ తర్వాత ఫండస్‌ కెమెరా ద్వారా కంటి పరీక్ష నిర్వహిస్తారు.

eye 09102018 3

ఫండస్‌ కెమెరా ద్వారా వచ్చిన ఇమేజ్‌ను కంప్యూటర్‌ ద్వారా చెన్నై, హైదరాబాద్‌లోని అపోలో హాబ్‌ వైద్యులకు పంపిస్తారు. అక్కడ వైద్యులు ఈ ఇమేజ్‌ను పరిశీలించి రోగి కంటి సమస్య వివరాలను తిరిగి కంప్యూటర్‌ ద్వారా సీహెచ్‌సీకి పంపిస్తారు. ఆటోరిఫ్రాక్షన్ యంత్రం ద్వారా రోగి కళ్లను పరీక్షించి, ఎంత పవర్ ఉన్న కళ్లజోళ్లు అవసరమో గుర్తిస్తారు. మరోసారి మాన్యూవల్ గా పరీక్షించి కళ్ల పవర్ నిర్ధారిస్తారు. ఆటో రిఫ్రాక్షన్ ద్వారా ఇంత వరకూ 4,73,525 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. రోగులకున్న సుగర్, గ్లకోమా, కేటరాక్ట్ తో పాటు ఇతర కంటిలోపల ఉన్న వ్యాధులను ఫండస్ కెమెరా ద్వారా గుర్తిస్తారు. వాటి వివరాలను చైన్నైలో ఉన్నఅపోలో ఆసుపత్రికి వ్యాధుల నిర్ధారణకు పంపిస్తారు. అక్కడి నుంచి వెంటనే సమాచారం తెప్పించుకుంటారు. అపోలో వైద్యుల సూచన మేరకు చికిత్స అందజేస్తారు.

Advertisements