భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మురళీధరన్‌ దిల్లీ: ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జిగా వి.మురళీధరన్‌ నియమితులయ్యారు. కేరళకు చెందిన ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఏబీవీపీ, ఆరెస్సెస్‌లలో కీలకంగా పనిచేసిన మురళీధరన్.. ఆ తర్వాత భాజపాలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. కేరళ భాజపా అధ్యక్షుడిగానూ పనిచేశారు. అక్కడ పార్టీ విస్తరణలో కీలక భూమిక పోషించారు. గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సిద్దార్థనాథ్ సింగ్ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్నారు. యూపీ ఎన్నికల్లో గెలుపొంది ఆయన మంత్రి పదవి చేపట్టడంతో ఆ పదవి ఖాళీగా ఉంది.

amit 31072018 2

కాగా, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మురళీధరన్‌కు ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జిగా సులీల్‌దేవ్‌ధర్‌ను నియమించారు. మహారాష్ట్రకు చెందిన ఆయన గతంలో త్రిపుర భాజపా ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఇటీవలి త్రిపుర ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో సునీల్‌ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇద్దరు నేతలూ పార్టీకి దిశానిర్దేశం చేస్తారని అధిష్ఠానం భావిస్తోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది.

amit 31072018 3

ఒకటి రెండు మార్పులు, చేర్పులతో మరో రెండు రోజుల్లో కార్యవర్గాన్ని, వివిధ విభాగాల బాధ్యులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీజేపీ జాతీయ కార్యదర్శిగా వై.సత్యకుమార్‌ నియమి తులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడి ఆమోదం మేరకు ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. కడప జిల్లాకు చెందిన సత్యకుమార్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వద్ద చాలా కాలం పాటు ఓఎస్డీగా పనిచేశారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఆయనతో కలిసి పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీలతోనూ సత్యకుమార్‌కు అనుబంధం ఉంది.

Advertisements