తగిన పర్యావరణ అనుమతులు వచ్చే వరకు ‘గోదావరి-కృష్ణా-పెన్నా’ నదుల అనుసంధానం ప్రాజెక్టు పనులు నిలిపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌, త్రినాథరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆదర్శకుమార్‌ గోయెల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. తుది ఆదేశాలను శుక్రవారం వెబ్‌సైట్లో పెట్టింది. ‘సీడబ్ల్యూసీ, పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ పిటిషన్‌ దాఖలైంది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(ఎస్‌పీసీబీ)ల నివేదిక కోరాం. ఎస్‌పీసీబీ నివేదిక ప్రకారం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కావాల్సి ఉంది.

green tribunal 01062019 1

కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు. అవసరమైన పర్యావరణ అనుమతులు వచ్చేవరకు ప్రాజెక్టును అనుమతించలేం. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ స్పందన అవసరం. ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా మేం నిరోధిస్తాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎస్‌పీసీబీలతో కలిసి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖ చెన్నైలోని ప్రాంతీయ కార్యాలయం నెల రోజుల్లో ప్రాజెక్టును తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలి. ఈ ఆదేశాల ప్రతులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై కార్యాలయం, ఎస్‌పీసీబీ, సీపీసీబీలకు ఈమెయిల్‌ ద్వారా పంపుతున్నాం. తదుపరి విచారణ ఆగస్టు 13న జరుపుతాం’ అని ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Advertisements