శ్రీకాకుళం తుపాను బాధితులకు సహాయం చేయడానికి యువ కథానాయకుడు నిఖిల్‌ స్వయంగా ఆ జిల్లాకు వెళ్లారు. బియ్యం, దుపట్లు, జనరేటర్ల‌తో పాటు ఆహారం పంపిణీ చేశారు. బాధితులకు ఆయన స్వయంగా ఇవన్నీ పంచడం విశేషం. అంతేకాదు వారితో కలిసి భోజనం చేశానని, ఇది చాలా సంతృప్తిని ఇచ్చిందని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. అక్కడ తీసిన కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. ‘ఎంతో సంతృప్తి పొందిన ఈ రోజు.. మనస్ఫూర్తిగా భోజనం చేశా. 500 దుప్పట్లు, విద్యుత్‌లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం పోర్టబుల్‌ జనరేటర్లు, 3వేల మందికి భోజనం.. శ్రీకాకుళంలో పంపిణీ చేశాం. శ్రీకాకుళం ప్రజలు ధైర్యంగా ఉండాలి’ అని నిఖిల్‌ సోమవారం రాత్రి ట్వీట్లు చేశారు.

nikhil 16102018

శ్రీకాకుళం జిల్లాకు స్వయంగా వెళ్లి బాధితులకు సహాయం అందిస్తున్న తొలి హీరో నిఖిల్‌ కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిమానులు కామెంట్లు చేశారు. నటుడు సంపూర్ణేష్‌ బాబు తొలుత శ్రీకాకుళం తుపాను బాధితులకు విరాళం ప్రకటించారు. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ, ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ తమవంతు ఆర్థిక సహాయం అందించారు. మరో పక్క, బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు తెలుగు సినీ లోకం పెద్ద ఎత్తున స్పందించింది. తమవంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, అభిమానులు కూడా స్పందించాలంటూ పిలుపునిచ్చింది.

nikhil 16102018

ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన ‘తిత్లీ’ తుపాను బాధితుల సహాయార్థం అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ రూ. 15 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌ రూ. 5 లక్షలు ప్రకటించారు. యువ కథానాయకులు వరుణ్‌తేజ్‌, విజయ్‌ దేవరకొండ చెరో రూ. 5 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి రూ. లక్ష, సంపూర్ణేష్‌ బాబు రూ. 50 వేలు తిత్లీ బాధితుల సహాయార్థం అందజేయనున్నట్టు వెల్లడించారు.

Advertisements