ఆపరేషన్ కుమారా.. కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడేయటానికి బీజేపీ ప్రభుత్వం భారీ కుట్ర పన్నినట్టు కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చింది. కాంగ్రెస్ పార్టీలోని 20 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసిందని, ఆ 20 మందిని మిలిటరీ హెలికాప్టర్ లలో ముంబై తరలించారని, కుమారస్వామి ఆరోపిస్తున్నారు. మరోపక్క అసంతృప్తులను బుజ్జగించేందుకు స్వయంగా కేపీసీసీ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావ్‌, కార్యాధ్యక్షుడు ఈశ్వర్‌ ఖండ్రె రంగంలోకి దిగారు. అటు మాజీ సీఎం సిద్దరామయ్య కూడా తన అనుచరులను బుజ్జగిస్తున్నారు. ప్రభుత్వానికి ద్రోహం తలపెట్టవదని వేడుకుంటున్నారు. ఇంతజరుగుతున్నా అసమ్మతి ఎమ్మెల్యేల వ్యూహం ఏమిటో అంతుపట్టడం లేదు.

karnataka 21092018 2

మంత్రి రమేశ్‌ జార్కిహోళి, ఆయన సోదరుడు సతీశ్‌ జార్కిహోళి ఆధ్వర్యంలో వీరు ముంబై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నిజానికి బెళగావి జిల్లా కాంగ్రెస్‌ నేతల్లో తలెత్తిన అసమ్మతి సమసిపోయిందని బుధవారం అంతా భావించారు. జార్కిహోళి సోదరులతో సమన్వయ కమిటీ చైర్మన్‌ సిద్దరామయ్య, సీఎం కుమారస్వామి రెండ్రోజులు మంతనాలు జరిపి వారిని బుజ్జగించారని, ఇక సంకీర్ణానికి ఢోకా లేదని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కానీ రాత్రికి రాత్రే పరిస్థితి తారుమారైంది. అసమ్మతి ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరికి పూర్తి భద్రత కల్పించే బాధ్యతను మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ తన మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌కు అప్పగించారు.

karnataka 21092018 3

ముంబై వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమగ్ర చర్చలు ముగిశాక వీరు కీలక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. బుధవారం కాంగ్రె్‌సలోనే ఉంటామని ప్రకటించిన మంత్రి రమేశ్‌, సుధాకర్‌.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నాయకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ పదేపదే ప్రయత్నిస్తోందని కుమారస్వామి విరుచుకుపడ్డారు. ఆ పార్టీపై ప్రజలు తిరగబడాలని గురువారం హాసన్‌ జిల్లా బహిరంగ సభలో పిలుపిచ్చారు. అసమ్మతి ఎమ్మెల్యేలను తరలించేందుకు బీజేపీ మిలిటరీ విమానాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు.

Advertisements