పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణం సోమవారం పూర్తయింది. గోదావరి గర్భంలో నిర్మించే దిగువ కాపర్‌ డ్యాంకు సంబంధించి ముందుగా నిర్మాణం చేపట్టిన జెట్‌ గ్రౌటింగ్‌ పని సోమవారం సాయంత్రంతో పూర్తయింది. 2017 నవంబర్‌ 26న ప్రారంభించిన జెట్‌ గ్రౌటింగ్‌ నిర్మాణ పని 2018 ఫిబ్రవరి 3వ తేదీ వరకు తొలిదశ పూర్తిచేశారు. అనంతరం 2018 జూలై 5వ తేదీన జెట్‌గ్రౌటింగ్‌ పని ప్రారంభించినప్పటికీ వరదల కారణంగా ఆగస్టు, సెప్టెంబరుల్లో నిలిచిపోయింది. మొత్తం 1,417 మీటర్ల పొడవున దీనిని నిర్మించాల్సి ఉండగా వరదలకు ముందు 1,098 మీటర్ల వరకు పని పూర్తయింది. మిగిలిన 319 మీటర్ల పనిని ఈ నెలలో పూర్తిచేశారు. కాఫర్‌ డ్యాంకు దిగువన గోదావరి జలాలు ఊట రాకుండా, ఇసుకను గట్టి పరచడమే జెట్‌ గ్రౌటింగ్‌.

polavaram 30102018 2

ఈ పనిని రెండు డయా మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతు చొప్పున ఒక కాలమ్‌గా ఇసుకను గట్టి పరిచారు. మొత్తం 947 కాలమ్స్‌లో ఈ జెట్‌ గ్రౌటింగ్‌ పనులు పూర్తిచేసినట్లు ప్రాజెక్ట్‌ ఈఈ డి.శ్రీనివాస్‌, డీఈ కృష్ణారావు తెలిపారు. కెల్లార్‌ సంస్థ రికార్డు సమయంలో ఈ పనులను పూర్తిచేసిందని జలవనరుల మంత్రి దేవినేని ఉమ సచివాలయంలో తెలిపారు. ఒక నాయకుడు జెట్‌ గ్రౌటింగ్‌ కొట్టుకుపోయిందని అంటున్నారని, అసత్యాలు చెబితే జాతి క్షమించదని స్పష్టం చేశారు. డిసెంబరు రెండో వారంలో గేట్లు అమర్చే పని చేపడతామన్నారు. వచ్చేవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అవుతామన్నారు.

polavaram 30102018 3

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నవంబరు తొలివారంలో శంకుస్థాపన చేయనున్నట్లు దేవినేని చెప్పారు. గోదావరి డెల్టాలో రెండో పంటకు నీరు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులకు రూ.61,242 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పట్టిసీమ ద్వారా 78 టీఎంసీలు తరలించి కృష్ణా డెల్టాను ఆదుకున్నామని చెప్పారు. డిసెంబరు నాటికి హంద్రీ-నీవా జలాలను కుప్పానికి తరలిస్తామన్నారు. సీఎం మంగళవారం గండికోట రిజర్వాయరును సందర్శించి జలహారతి ఇస్తారని చెప్పారు. చోడవరం, వైకుంఠపురం ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు.

 

Advertisements