నూతన శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయనకు సీఎం కార్యాలయం నుంచి బుధవారం సమాచారం వచ్చింది. శంబంగి సానుకూలంగా స్పందించడంతో దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. నూతన శాసనసభ్యులతో ప్రమాణం చేయించడంతో పాటు శాసనసభ స్పీకర్‌ ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ నిర్వహిస్తారు. నూతన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించాక ప్రొటెం స్పీకర్‌ పదవీ కాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుపై విజయం సాధించిన శంబంగి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిందని శంబంగి మీడియాకు చెప్పారు.

Advertisements