అమృత్‌సర్‌ సమీపంలోని జోడా ఫాఠక్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద దసరాను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు నిర్వహించిన రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన స్థానిక ప్రజలపైకి రైలు దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 61 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 72 మంది గాయపడ్డారు. రైలు పట్టాల పక్కనే ఉన్న ఒక మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని దాదాపు 300 మంది వీక్షిస్తున్నారు. రావణుడి బొమ్మను వెలిగించగానే.. బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇదే సమయంలో కొందరు పట్టాలపైకి వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. రావణ దహనాన్ని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండు వేరువేరు ట్రాక్‌ల మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి.

punjab 20102018 2

కంగారుపడ్డ జనానికి తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది. బాణసంచా తాలూకూ మోత, పొగ, రావణుడి బొమ్మ దహనం వల్ల వెలువడ్డ వెలుగులతో జనానికి దృశ్యగోచరత సరిగా లేదు. రైలు మోత వినిపించలేదు. ఈ అయోమయంలో.. జలంధర్‌ నుంచి అమృత్‌సర్‌ వైపు వేగంగా దూసుకెళుతున్న రైలు కిందపడి నలిగిపోయారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు అమృత్‌సర్‌ సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ రాజేశ్‌ శర్మ చెప్పారు. కళ్ల ముందే బంధువులు, స్నేహితులు దుర్మరణం పాలవ్వడాన్ని చూసిన జనం గుండెలు అవిసేలా రోదించారు. తమవారి జాడ కోసం మరికొందరు అన్వేషణలో పడ్డారు. తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం మొత్తం భయానకంగా ఉంది.

punjab 20102018 3

మృతుల్లో అనేక మంది చిన్నారులూ ఉన్నారు. కొన్ని మృతదేహాలను గుర్తించలేకపోయారు. ఈ దృశ్యాలు.. వీక్షకుల గుండెలను పిండేశాయి. మృతదేహాలను తొలగిచేందుకు అక్కడికి వచ్చిన అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. శవాలను తొలగించడానికి తొలుత అంగీకరించలేదు. దీంతో ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా మృతదేహాలు ఘటనా స్థలిలో పడి ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి డీజీపీ నేతృత్వంలో అదనపు బలగాలు అక్కడికి తరలివచ్చాయి. రావణ దహనకాండ వేడుకకు, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సిద్ధూ భార్య, స్థానిక ఎమ్మెల్యే నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాదం తర్వాత స్థానికులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisements