ప్రయాణికులకు అతి తక్కువ ధరల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందజేయాలన్న లక్ష్యంతో రూపొందిన ‘రైల్‌ నీర్‌’ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అడుగు ముందుకుపడింది. విజయవాడ దగ్గరలోని మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో ‘ రైల్‌నీర్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌’ ఏర్పాటు చేయటానికి ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) శ్రీకారం చుట్టింది. మల్లవల్లిలో ప్లాంట్‌ కోసం 1.04 ఎకరాల భూమిని ఏపీఐఐసీ నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఎకరం రూ. 16.50 లక్షల ధరకు అవుట్‌రేట్‌ సేల్‌ కింద కొనుగోలు చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. భూమి కేటాయింపుపై ఇప్పటికే ఏపీఐఐసీ నుంచి ఐఆర్‌సీటీసీకి మౌఖికంగా అనుమతి లభించింది. అధికారికంగా ఐఆర్‌సీటీసీకి, ఏపీఐఐసీ భూమిని కేటాయించాల్సి ఉంది.

rail neer 14072018 2

స్వాధీనంచేసే భూమిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఏపీఐఐసీ ఆసక్తి చూపింది. ఏపీఐఐసీ ఇంకా భూమిని తమకు కేటాయించకపోవటంతో బుధవారం ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో తమకు ప్రతిపాదించిన భూమిని పరిశీలించారు. ఆ తర్వాత ఏపీఐఐసీ అధికారులను ఎప్పటికి భూమిని స్వాధీనం చేస్తారని అడిగారు. అలాట్‌మెంట్‌ చేసిన తర్వాత సేల్‌ డీడ్‌ రాసుకున్నాక భూమిని స్వాధీనం చేస్తామని, దీనికి నెల రోజుల సమయం పట్టవచ్చని ఐఆర్‌సీటీసీ ప్రతినిధులకు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. తాము త్వరగా ‘రైల్‌ నీర్‌’ బాట్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయదలిచామని, సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్థలం స్వాధీనంతోనే ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తామని ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు ఏపీఐఐసీ దృష్టికి తీసుకు వచ్చారు.

rail neer 14072018 3

సరిగ్గా 2012-13 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రైల్‌ నీర్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేటాయింపులు చేయటం జరిగింది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్‌ తర్వాత కీలకమైన విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ నీర్‌ ’ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం కేటాయింపులు చే సింది. విజయవాడలో పుష్కలంగా నీటి లభ్యత ఉందని, కృష్ణానది చెంతనే ఉండటం వల్ల నీటికి సమస్య ఉండదని గుర్తించిన కేంద్రం ఈ ప్రాజెక్టును ఏరికోరి మరీ అప్పట్లో విజయవాడ డివిజన్‌కు కేటాయించింది. అప్పట్లో రూ.10 కోట్ల వ్యయంతో ‘రైల్‌ నీర్‌ ’ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. కానీ, కార్యరూపం దాల్చటంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంది.

Advertisements