గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ గోడను కూల్చివేశారు. రేవంత్‌ రెడ్డి, ఏపీ వైకాపాకు చెందిన ఓ నేతకు మధ్య సర్వే నంబరు 127కు సంబంధించి భూవివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వైకాపా నేత అనుచరులు మూడు జేసీబీలు ఉపయోగించి వివాదాస్పదంగా ఉన్న ప్రహరీని కూల్చి వేశారు. ఈ ఘటనపై రేవంత్‌ రెడ్డి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

revanth 04122018 2

మరో పక్క, కేసీఆర్ సభ సందర్భంగా రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నియోజకవర్గంలో భారీగా బలగాలను మోహరించారు. అటు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నిరసన దీక్షకు దిగారు. రేవంత్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌పై కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌తో కొడంగల్ అట్టుడికిపోతోంది. నియోజకవర్గం అంతటా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.

revanth 04122018 3

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌ అభిమానులు తిట్టిపోశారు. రేవంత్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కోస్గిలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన కేసీఆర్‌ సభను అడ్డుకుంటామని రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు కొడంగల్‌లో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ సభ ముగిశాక రేవంత్‌‌తో పాటు ఆయన అనుచరులను విడుదల చేస్తామని ఎస్పీ అన్నపూర్ణ స్పష్టం చేశారు.

Advertisements