సభలు, ర్యాలీల నియంత్రణపై అర్ధరాత్రి ఇచ్చిన తుగ్లక్ జీవో నాలుక గీసుకోవటానికి కూడా పనికి రాదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ సభలు ఎక్కడ పెట్టాలో చెప్తున్నవారు, రేపు ఆ సభల్లో ఏం మాట్లాడాలో కూడా తాడేపల్లి స్క్రిప్ట్ రాసిస్తారా ? అని ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీ ఈ జీవోని చూసి వెన‌క్కి త‌గ్గ‌ద‌ని, యథావిథిగా సభలు, ర్యాలీలు నిర్వహించి తీరుతామ‌న్నారు. సభలు, ర్యాలీలు నియంత్రించాలని చూడటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రతిపక్షాలు కూటమి గా ఏర్పాటైన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను అడ్డుకునే చర్యలు న్యాయబద్ధంగానే ఎదుర్కొంటామ‌న్నారు. చీకటి జీవో అమలు చేయాలనుకునే అధికారులు నేటి సీఎం తూ.గో పర్యటనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బ‌హిరంగ‌స‌భ‌లు నిషేధించిన అధికారులు ఇవాళ రాజమహేంద్రవరం లో సీఎం రోడ్డు షోకు ఎలా అనుమతులిచ్చారని నిల‌దీశారు. తామనుకున్నట్లు చేయటానికి ఇదేం రాజారెడ్డి రాజ్యాంగం కాదన్నారు. ఒక పార్టీ గొంతు నొక్కటానికి అన్ని పార్టీల మెడకు ఉరి బిగిస్తున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త్వరలోనే అఖిలపక్షాలతో విశాఖ వేదికగా సమావేశం నిర్వహించి కార్యాచరణ వెల్లడిస్తామ‌న్నారు.

Advertisements