తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలైనట్టు వచ్చిన మార్కులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఓ విద్యార్థిని రీవెరిఫికేషన్‌ ఫలితాల్లో ఉత్తీర్ణురాలైనట్టు వెల్లడైంది. ఆమెకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 28 మార్కులు పెరిగినట్టు తేలింది. ఇంటర్‌ ఫలితాల తర్వాత ఆత్మహత్య చేసుకున్న సుమారు 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డు నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలకు అనామిక ఉదంతం సాక్ష్యంగా నిలుస్తోంది! ఈ రీవెరిఫికేషన్ ఫలితాల్ని ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో చూసిన ఆమె కుటుంబ సభ్యులు ఇంటర్‌ బోర్డుపై చర్యలకు డిమాండ్‌ చేస్తున్నారు.

inter 01062019 1

హైదరాబాద్ కోఠిలోని ప్రగతి మహా విద్యాలయలో ఇంటర్మీడియట్ సీఈసీ మొదటి సంవత్సరం చదివిన అనామిక.. గత నెల ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలను చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. పరీక్ష బాగా రాసినప్పటికీ ఎందుకు ఫెయిలైందో అర్థం కాక ఒత్తిడికి గురైంది. అన్ని సబ్జెక్టుల్లో పాసైనప్పటికీ.. తెలుగులో 20 మార్కులే వచ్చి ఫెయిలైనట్లు మార్కుల మెమోలో కనిపించడంతో బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆంగ్లంలో 64, ఎకనామిక్స్‌లో 55, సివిక్స్‌లో 67, కామర్స్‌లో 75 మార్కులు వచ్చినప్పటికీ.. తెలుగులో మాత్రం 20 మార్కులే వచ్చినట్లు మెమోలో కనిపించడంతో తీవ్ర ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడింది.

inter 01062019 1

అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడంతో.. అందులో అనామిక పాసైనట్టు వెల్లడైంది. తెలుగులో ఆమెకు 28 మార్కులు పెరిగి.. మొత్తం 48 మార్కులు వచ్చి ఉత్తీర్ణురాలైనట్లు ఇంటర్ బోర్డు తన వెబ్ సైట్‌లో పేర్కొంది. ఈ రోజు వెబ్‌సైట్‌లో తమ కుమార్తె పాసైనట్లు కనిపించడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisements